టి-పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మైండ్ గేమ్స్ ఆడుతున్నారా? అంటే అవుననే అనిపిస్తోంది. ఈరోజు మధ్యాహ్నం దానం నాగేందర్ మీడియాతో మాట్లాడుతూ తాను కాంగ్రెస్ పార్టీలోకి తిరిగివెళ్ళబోవడం లేదని, అందుకోసం తాను ఉత్తమ్ కుమార్ రెడ్డిని హోటల్లో కలిసినట్లు వస్తున్న వార్తలు నిజం కాదని, కాంగ్రెస్ పార్టీకి బలమైన అభ్యర్ధులు లేనందునే తనపై ఈవిధంగా దుష్ప్రచారం చేస్తోందని ఆరోపించారు.
దానం నాగేందర్ మాట్లాడిన కాసేపు తరువాత ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మీడియాతో మాట్లాడారు. అయితే దానం నాగేందర్ తనను కలిశారో లేదో స్పష్టంగా చెప్పకుండా “దానం నాగేందర్ నన్ను కలిస్తే తప్పేమిటి?” అని ప్రశ్నించారు. తద్వారా దానం నాగేందర్ తనను కలిసి ఉండవచ్చనే భావన కల్పించారు. అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మైండ్ గేమ్స్ ఆడుతున్నారనే అర్ధం అవుతోంది.
కాంగ్రెస్ నేతలు ఆడుతున్న ఈ మైండ్ గేమ్ కారణంగా టిఆర్ఎస్ అధిష్టానానికి ఆయనపై అనుమానం కలిగినట్లయితే టికెట్ లభించక నష్టపోవచ్చు. టిఆర్ఎస్ తొలిజాబితాలో టికెట్ లభించక ఆందోళన చెందుతున్న దానం నాగేందర్ కు ఇది మరొక అగ్నిపరీక్షగా మారినట్లు కనిపిస్తోంది. తాను టికెట్ ఆశించడం లేదని ఆయన చెప్పుకొన్నప్పటికీ, నిజంగా టికెట్ లభించకపోతే ఆయన పరిస్థితి అయోమయంగా మారవచ్చు. కనుక ఆయన కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలపై మళ్ళీ ధీటుగా స్పందించక తప్పదు.