ఇంకా టికెట్ ఆశిస్తున్నారా?

September 10, 2018


img

 సిఎం కెసిఆర్‌ విడుదల చేసిన టిఆర్ఎస్‌ అభ్యర్ధుల తొలి జాబితాలో కొండా సురేఖ పేరు లేకపోవడంతో ఆమె హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ పెట్టి సిఎం కెసిఆర్‌, మంత్రి కేటీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. తద్వారా ఆమె స్వయంగా తలుపులు మూసుకొన్నట్లయింది. ఆ స్థాయిలో విమర్శలు చేసిన తరువాత ఇంకా ఆమె టికెట్ కోసం ఎదురుచూస్తుండటం విచిత్రం. టిఆర్ఎస్‌ నిర్ణయం వెలువడిన తరువాత తమ కార్యాచరణ ప్రకటించాలని కొండా దంపతులు నిర్ణయించుకొన్నారని తాజా సమాచారం.

ఆమెకు ఎలాగూ ఇక టికెట్ లభించే అవకాశం లేదు. ఆ సంగతి వారికి కూడా తెలుసు. కానీ ఇంకా ఎదురుచూపులు దేనికంటే బహుశః పార్టీ చేత సస్పెన్షన్ వేటు వేయించుకొని టిఆర్ఎస్‌ నుంచి బయటపడాలని కావచ్చు. తద్వారా ప్రజలలో కాస్త సానుభూతి లభిస్తుందని వారి ఉద్దేశ్యం కావచ్చు. టిఆర్ఎస్‌ ఎంపీ డి.శ్రీనివాస్ కూడా ఇంచుమించు ఇదేవిధంగా వ్యవహరించినప్పుడు టిఆర్ఎస్‌ స్పందించకపోవడం అందరూ చూశారు. కనుక కొండా సురేఖ విషయంలో కూడా టిఆర్ఎస్‌ అధిష్టానం ఎటువంటి నిర్ణయమూ తీసుకోకపోవచ్చు. కనుక బంతి కొండా కోర్టులోనే ఉన్నట్లు భావించవచ్చు.

కొండా దంపతులు డిల్లీ వెళ్ళి సోనియా గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సన్నాహాలు చేసుకొంటున్నట్లు సమాచారం. కానీ కాంగ్రెస్ పార్టీ వారిని ఆహ్వానిస్తుందా లేదో చూడాలి. ఎందుకంటే, వారు టికెట్స్ ఆశిస్తున్న వరంగల్ తూర్పు, పరకాల నియోజకవర్గాల టికెట్స్ ఆశిస్తున్నవారు కాంగ్రెస్ పార్టీలో అనేకమంది ఉన్నారు. కొండా సురేఖను పార్టీలోకి తీసుకొంటే ఆ నియోజకవర్గాలలో కాంగ్రెస్‌ పార్టీలో చిచ్చు మొదలవవచ్చు. 


Related Post