దత్తన్న శాసనసభకు పోటీ?

September 10, 2018


img

త్వరలో జరుగనున్న తెలంగాణా శాసనసభ ఎన్నికలు రాష్ట్రంలో అన్ని పార్టీలకు జీవన్మరణ సమస్యవంటివి కావడంతో, అన్ని పార్టీలు గెలుపే లక్ష్యంగా అనూహ్యమైన నిర్ణయాలు తీసుకొంటున్నాయి. రాష్ట్ర బిజెపి కూడా ఒక అనూహ్యమైన నిర్ణయం తీసుకొన్నట్లు తాజా సమాచారం.    

మాజీ కేంద్రమంత్రి, ఎంపీ బండారు దత్తాత్రేయను, ఎమ్మెల్సీ రాంచందర్ రావులను ఈసారి శాసనసభకు పోటీకి దింపబోతున్నట్లు తెలుస్తోంది. వారిరువురికీ తమతమ నియోజకవర్గాలలో గట్టి పట్టుండటంతో వారిని శాసనసభ స్థానాలలో పోటీకి దింపినట్లయితే ఖచ్చితంగా ఆ రెండు సీట్లు వారు గెలుచుకోగలరని ఆ మేరకు రాష్ట్ర బిజెపికి ప్రయోజనం చేకూరుతుందని ఆ పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

వారిలో దత్తన్నను సనత్ నగర్ నుంచి, రాంచందర్ రావును మల్కాజ్ గిరీ పరిధిలోని ఉప్పల్ లేదా కుతుబుల్లా పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయించవచ్చునని సమాచారం. అదే కనుక జరిగితే సనత్ నగర్ నుంచి టిఆర్ఎస్‌ టికెట్ పై పోటీ చేస్తున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు దత్తన్న గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది కనుక గెలుపు కోసం తలసాని చెమటోడ్చక తప్పదు. అదేవిధంగా టిఆర్ఎస్‌ అభ్యర్ధులు బేతి సురేశ్ రెడ్డి (ఉప్పల్), కెపి వివేకానంద (కుతుబుల్లా పూర్) ఇద్దరిలో ఎవరో ఒకరు బిజెపి నుంచి గట్టి పోటీ ఎదుర్కోవలసిరావచ్చు. నగరంలో మంచి పట్టున్న కాంగ్రెస్‌, టిడిపిలు తమ అభ్యర్ధులను ఇంకా ప్రకటించవలసి ఉంది. అవి కూడా టిఆర్ఎస్‌, బిజెపి అభ్యర్ధులను ఎదుర్కోగల బలమైనా అభ్యర్ధులనే నిలబెట్టడం ఖాయం. కనుక ఈసారి ఎన్నికలలో పోటీ చాలా రసవత్తరంగా ఉండబోతోంది.


Related Post