టిడిపి-కాంగ్రెస్‌ దోస్తీ లాభమో నష్టమో?

September 10, 2018


img

తెలంగాణా టిడిపి నేతలకు వారి అధినేత చంద్రబాబు నాయుడు ఎత్తులు, పొత్తుల విషయంలో పూర్తి స్వేచ్చనీయడంతో వారు కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయడానికి సిద్దం అవుతున్నారు. అందుకోసం ముందుగా ఎన్నికల కమిటీలను ఏర్పాటు చేసుకొని ముందస్తు ఎన్నికలు సన్నాహాలు మొదలుపెట్టారు. 

ఎన్నికల సమన్వయ కమిటీలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ, సీనియర్ నేతలు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, పెద్దిరెడ్డి, టి.దేవేందర్‌గౌడ్, నామా నాగేశ్వరరావు, మండవ వెంకటేశ్వరరావులు ఉన్నారు. 

టి.దేవేందర్‌గౌడ్‌ అధ్యక్షతన ఎన్నికల మ్యానిఫెస్టో కమిటీలో రావుల చంద్రశేఖర్‌రెడ్డి, బక్కని నర్సింహులు, అలీ మస్కతి, బండ్రు శోభారాణి సభ్యులుగా ఉన్నారు. 

గరికపాటి మోహన్‌రావు అధ్యక్షుడిగా ఏర్పాటు చేయబడిన ఎన్నికల ప్రచార కమిటీలో సండ్ర వెంకటవీరయ్య, కొత్తకోట దయాకర్‌రెడ్డి, అరవింద్‌కుమార్‌గౌడ్, రమావత్‌ లక్ష్మణ్‌నాయక్‌ సభ్యులుగా ఉన్నారు. 

ఎన్నికల సమన్వయ కమిటీ సభ్యులు తొలి సమావేశం నిర్వహించి టిఆర్ఎస్‌ను ఓడించేందుకు తమతో కలిసివచ్చే పార్టీలను కలుపుకుపోవాలని నిర్ణయించారు. ఆ కమిటీ అధ్యక్షుడు ఎల్ రమణ వెంటనే కాంగ్రెస్‌, తెలంగాణా జనసమితి, వామపక్షాల నేతలకు ఫోన్లు చేసి పొత్తులపై చర్చలకు రావలసిందిగా ఆహ్వానించినట్లు సమాచారం 

తెలంగాణా జనసమితి, వామపక్షాలతో ఏ పార్టీలు పొత్తులు పెట్టుకొన్నా ఎవరూ ఆశ్చర్యపోరు కానీ రాజకీయంగా బద్ధ విరోధులైన కాంగ్రెస్-తెలుగుదేశం పార్టీలు కలిసి పనిచేస్తే అది చాలా విచిత్రమే. ఆ పొత్తులతో అవి మరింత బలోపేతం అవుతాయో లేక టిడిపితో పొత్తు కాంగ్రెస్ పార్టీ కొంప ముంచుతుందో? 


Related Post