కెసిఆర్‌ షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు?

September 10, 2018


img

శాసనసభను రద్దు చేసిన తరువాత సిఎం కెసిఆర్‌ మాట్లాడుతూ తెలంగాణా శాసనసభ ఎన్నికల షెడ్యూల్ అక్టోబరు మొదటివారంలో ఎన్నికలు నవంబరులోగా జరుగవచ్చని చెప్పడాన్ని ప్రతిపక్షాలు తప్పుపడుతూ ఎన్నికల కమీషన్ కు ఆయనపై ఫిర్యాదు చేసినప్పటికీ, కెసిఆర్‌ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరగడం ఖాయంగా కనిపిస్తోంది. 

మొదట జనవరి 2019లోగా తెలంగాణాలో ఓటర్ల జాబితాను ఖరారు చేయాలని ఆదేశించిన ఎన్నికల కమీషన్ ఆ గడువును తగ్గించింది. శాసనసభ రద్దు దృష్ట్యా అక్టోబర్ 8వ తేదీ నాటికే ఓటర్ల జాబితాను ఖరారు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఆ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రాజత్ కుమార్ ఓటర్ల జాబితాను ఖరారు చేయడానికి నిర్ధిష్టమైన షెడ్యూల్ ప్రకటించారు.

దాని ప్రకారం నేడు అంటే సెప్టెంబరు10న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ, 25వరకు అభ్యంతరాలు, వినతుల స్వీకరణ, 15,16 తేదీలలో  దీని కోసం గ్రామస్థాయిలో ప్రచార కార్యక్రమం, అక్టోబరు 4న మళ్ళీ అభ్యంతరాలు, వినతుల స్వీకరణ, అక్టోబరు 7న ఆ వివరాలను అన్నిటినీ డేటాబేస్ లో నమోదు చేయడం, అక్టోబరు 8వ తేదీన తుది ఓటర్ల జాబితా ప్రకటన చేస్తారు.

అంటే సిఎం కెసిఆర్‌ చెప్పినట్లుగానే అక్టోబరు 8 తరువాత ఎప్పుడైనా తెలంగాణా శాసనసభకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించవచ్చని స్పష్టం అవుతోంది లేకుంటే జనవరిలో ప్రకటించవలసిన తుది ఓటర్ల జాబితాను హడావుడిగా అక్టోబరు 8న ప్రకటించవలసిన అవసరం లేదు. కనుక నవంబరులోనే శాసనసభ ఎన్నికలు జరగడం ఖాయమే.


Related Post