కెసిఆర్‌కి విధేయుడిని అంటూనే తిరుగుబాటు చేస్తారా?

September 10, 2018


img

ఈసారి ఇద్దరు టిఆర్ఎస్‌ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఇవ్వలేకపోయామని, వారిద్దరికీ వేరే పదవులిచ్చి కడుపులో పెట్టుకొని చూసుకొంటామని సిఎం కెసిఆర్‌ స్వయంగా చెప్పారు. వారు బాబూ మోహన్ (ఆందోల్), నల్లాల ఓదెలు (చెన్నూరు). వారిరువురితో తాను స్వయంగా మాట్లాడానని, వారిని ఒప్పించిన తరువాతే వారి స్థానాలలో వేరే వారికి టికెట్స్ కేటాయించానని సిఎం కెసిఆర్‌ చెప్పారు. ఆందోల్ నుంచి చంటి క్రాంతి కిరణ్, చెన్నూరు నుంచి బాల్క సుమన్(ఎంపీ)లకు కెసిఆర్‌ టికెట్లు కేటాయించారు. బాబూమోహన్ పై స్థానికంగా తీవ్ర వ్యతిరేకత ఉన్నందున తనకు టికెట్ ఇవ్వకపోయినా ఆయన మౌనం వహించారు. కానీ ఓదెలు మాత్రం చెన్నూరు నుంచి తానే పోటీ చేయబోతున్నానని ప్రకటించారు.


ఆదివారం మందమర్రిలో తన అనుచరులను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “ఉద్యమ సమయం నుంచి నేను కెసిఆర్‌ను అంటిపెట్టుకొని పనిచేశాను కనుకనే నాకు 2009 ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇచ్చి ప్రోత్సహించారు. ఆ సమయంలో ప్రచారం చేసుకొనేందుకు నా దగ్గర డబ్బు లేదని తెలిసి ఆయనే ప్రచారఖర్చులకు డబ్బు కూడా ఇచ్చారు. 2010లో నా పదవికి రాజీనామా చేయమన్నప్పుడు మారుమాట్లాడకుండా రాజీనామా చేశాను. అందుకే ఆ తరువాత మళ్ళీ టికెట్ ఇచ్చి ప్రోత్సహించారు. నేను ఆయన నమ్మకాన్ని, నా నియోజకవర్గపు ప్రజల నమ్మకాన్ని  ఎప్పుడూ నిలబెట్టుకొంటూనే ఉన్నాను. ఎల్లప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నాను. సిఎం కెసిఆర్‌ సహకారంతో నా నియోజకవర్గం అన్ని విధాలా అభివృద్ధి చేసుకొన్నాను.


ఇటీవల సిఎం కెసిఆర్‌ ప్రకటించిన మొదటి జాబితాలో నాపేరు లేకపోయినప్పటికీ మళ్ళీ నాకే తప్పకుండా టికెట్ ఇస్తారని నేను గట్టిగా నమ్ముతున్నాను. రాబోయే ఎన్నికలలో చెన్నూరు నుంచి నేనే పోటీ చేస్తాను. ఇది ఖాయం.


బాల్కా సుమన్ కు ఈ టికెట్ కేటాయించినందున నేను ఆయనకు మద్దతు ఇస్తానని ఆయన చెప్పుకొంటున్నట్లు విన్నాను. అది నిజం కాదు. నేను హైదరాబాద్‌లో ఉన్నప్పుడు ఆయన వచ్చి నన్ను కలిసి తనకు చెన్నూరు నుంచి పోటీ చేయడానికి టికెట్ లభించిందని కనుక నా మద్దతు కావాలని కోరిన మాట వాస్తవం. అయితే స్థానికేతరుడైనందున చెన్నూరు నుంచి పోటీ చేసే విషయంలో పునరాలోచించుకోమని సలహా ఇచ్చాను. ఆయనకు మద్దతు ఇస్తానని నేను  ఎటువంటి హామీ ఇవ్వలేదు. ఎందుకంటే స్థానికుడినైన నేను పోటీ చేయాలనుకొంటున్నప్పుడు ఆవిధంగా ఎందుకు చెపుతాను? ఏది ఏమైనప్పటికీ రాబోయే ఎన్నికలలో చెన్నూరు నుంచి నేను పోటీ చేయడం తధ్యం,” అని చెప్పారు నల్లాల ఓదేలు.


సిఎం కెసిఆర్‌ గీసిన గీత దాటను... ఆయనకు వీర విధేయుడినని చెప్పుకొంటూనే, చెన్నూరు నుంచి నేనే పోటీ చేస్తానని చెప్పడం విశేషం. మరి ఆయనను టిఆర్ఎస్‌ ఏవిధంగా ఒప్పిస్తుందో చూడాలి. 


Related Post