కాంగ్రెస్‌-టిడిపి పొత్తులపై బాబు వ్యూహాత్మక వైఖరి

September 08, 2018


img

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు శనివారం హైదరాబాద్‌ వచ్చి తన పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీతో ఎన్నికల పొత్తులు పెట్టుకోవడంపై వారు చాలా లోతుగా చర్చించారు. 

కాంగ్రెస్‌తో పొత్తులకు ముందు చంద్రబాబే చొరవ చూపినప్పటికీ, దాని వలన రెండు రాష్ట్రాలలో రాజకీయంగా కలిగే ఇబ్బందులను గుర్తించి చివరి నిమిషంలో వెనక్కు తగ్గినట్లున్నారు. కాంగ్రెస్ పార్టీతో ప్రత్యక్షంగా పొత్తులు పెట్టుకోవడం వలన రెండు పార్టీలకు రెండు రాష్ట్రాలలో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవలసి ఉంటుంది కనుక పొత్తులు పెట్టుకొంటున్నట్లు ప్రకటించకూడదని నిర్ణయించినట్లు తెలుస్తోంది. కానీ ప్రస్తుత పరిస్థితులు, అవసరాల దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్‌-టిడిపిలు పరస్పర అవగాహనతోనే కలిసి పనిచేయాలని సూచించినట్లు తెలుస్తోంది. అది చాలా మంచి నిర్ణయమేనని చెప్పవచ్చు.

తెలంగాణాలో టిడిపిని కాపాడుకొనేందుకు ఎటువంటి నిర్ణయాలు తీసుకొన్నా తనకు అభ్యంతరం లేదని చంద్రబాబు నాయుడు అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ నేతలతో కలిసి పనిచేసే విషయంలో పరిస్థితులను బట్టి వారే సముచిత నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగాలని చంద్రబాబు నాయుడు పార్టీ నేతలకు సూచించారు. టిటిడిపి నేతల నిర్ణయాలలో తాను తలదూర్చనని చెప్పడం తద్వారా టిడిపి ఆంద్రా పార్టీ అని సిఎం కెసిఆర్‌ చేసిన ఆరోపణలకు జవాబు చెప్పినట్లు భావించవచ్చు. తెలంగాణా శాసనసభ ఎన్నికల ప్రచారంలో తాను పాల్గొనలేనని తేల్చి చెప్పినట్లు సమాచారం.

కాంగ్రెస్‌తో పొత్తుల విషయంలో చంద్రబాబు తన రాజకీయ చతురతను ప్రదర్శించారని చెప్పవచ్చు. ఇకపై టిటిడిపి నేతలు కాంగ్రెస్ పార్టీతో ఏవిధంగా వ్యవహరించబోతున్నారో చూడాలి.


Related Post