కొండా సురేఖ సెల్ఫ్ గోల్?

September 08, 2018


img

టిఆర్ఎస్‌ మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ సెల్ఫ్ గోల్ చేసుకొన్నారా? అంటే అవుననే చెప్పక తప్పదు. కొండా దంపతులు వ్యవహరిస్తున్న తీరు టిఆర్ఎస్‌కు చాలా ఇబ్బంది కలిగిస్తున్నప్పటికీ, సిఎం కెసిఆర్‌ మళ్ళీ ఆమెకే వరంగల్ తూర్పు నియోజకవర్గం టికెట్ ఇవ్వడానికి సిద్దపడ్డారు. అయితే వారు తమ కుమార్తె సుస్మితా పటేల్ కు కూడా టికెట్ ఇవ్వాలని షరతు పెట్టారు. ఈసారి కాంగ్రెస్ పార్టీ నుంచి గట్టి పోటీ ఎదుర్కోవలసి వస్తుంది కనుక వారసులకు టికెట్లు ఇవ్వలేమని టిఆర్ఎస్‌ అధిష్టానం వారికి నచ్చచెప్పినప్పటికీ, వారు పరిస్థితులు అర్ధం చేసుకోకుండా రెండు టికెట్ల కోసం పట్టుబడుతున్నారు. అభ్యర్ధుల జాబితాను ఖరారు చేసే ముందు కూడా టిఆర్ఎస్‌ అధిష్టానం వారికి నచ్చజెప్పే ప్రయత్నాలు చేసింది. కానీ కొండా దంపతులు వినకపోవడంతో వరంగల్ అర్బన్ జిల్లాలో ఆ ఒక్క నియోజకవర్గం తప్ప మిగిలిన అన్ని స్థానాలకు అభ్యర్ధులను సిఎం కెసిఆర్‌ ప్రకటించేశారు. 

నిజం చెప్పాలంటే, ఇప్పటికీ కొండా సురేఖ పట్ల సిఎం కెసిఆర్‌ చాలా ఉదారంగానే వ్యవహరిస్తున్నారని చెప్పుకోవచ్చు లేకుంటే వారు వ్యవహరిస్తున్న తీరుకి ఆగ్రహంతో ఆమె స్థానాన్ని వేరే వారికి కేటాయించి ఉండవచ్చు. వరంగల్ తూర్పు నియోజకవర్గం టికెట్ కోసం వరంగల్ మేయర్ నరేందర్, గుండు సుధారాణి, ఎర్రబెల్లి ప్రదీప్ రావు, సారయ్యలు పోటీ పడుతున్నారు. ఈ సంగతి కొండా దంపతులకు తెలియదనుకోలేము. 

తన స్థానానికే అనేక మంది పార్టీలో నలుగురు నేతలు పోటీ పడుతున్నప్పుడు, అడగకుండానే లభిస్తున్న టికెట్ ను తీసుకొని సంతోషించకపోగా కెసిఆర్‌ను నిందిస్తున్నట్లు సమాచారం. “మేము రెండు టికెట్లు అడిగితే నా టికెట్ కే సిఎం కెసిఆర్‌ ఎసరు పెట్టారని” కొండా సురేఖ ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే ఇది స్వయంకృతాపరాధామే తప్ప దీనిలో పార్టీని, సిఎం కెసిఆర్‌ను నిందించవలసిన పనిలేదు. వారికి కాంగ్రెస్ పార్టీ నుంచి రెండు సీట్లకు ఆఫర్ ఉన్నందునే టిఆర్ఎస్‌ అధిష్టానాన్ని ఈవిధంగా బెదిరిస్తున్నారని టిఆర్ఎస్‌ నేతలు అంటున్నారు. 

కొండా దంపతులు చేతికి వచ్చిన ఈ అవకాశాన్ని కాలదన్నుకోవడం ఒక తప్పు అయితే, విజయావకాశాలు ఎక్కువగా ఉన్న టిఆర్ఎస్‌ను కాదని కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఆలోచించడం మరో తప్పు. కొండా సురేఖ దంపతులు సెల్ఫ్ గోల్ చేసుకొంటునట్లే ఉంది.


Related Post