టిఆర్ఎస్‌కు మజ్లీస్ హ్యాండివ్వబోతోందా?

September 08, 2018


img

“అవును మజ్లీస్ పార్టీ మాకు నమ్మకమైన మిత్రపక్షం. రాబోయే ఎన్నికలలో మా రెండు పార్టీలు కలిసే సాగుతాయి. ఇందులో దాపరికం ఏమీ లేదు,” అని రెండు రోజుల క్రితమే సిఎం కెసిఆర్‌ చెప్పారు. ఆయన చెప్పకపోయినా ఆ సంగతి అందరికీ తెలుసు. అయితే టిఆర్ఎస్‌ పార్టీతో  మజ్లీస్ పార్టీ బేషరతుగా స్నేహం కొనసాగిస్తుందా? అంటే ఆ పార్టీ నేత అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన తాజా వ్యాఖ్యలు వింటే కాదనే అనిపిస్తుంది. 

హైదరాబాద్‌ మల్లేపల్లిలో ఆయన శుక్రవారం మజ్లీస్ పార్టీ కార్యకర్తలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సరిపడా మెజారిటీ లేకపోయినా కుమారస్వామి ముఖ్యమంత్రి అయ్యారు. మరి మనం మాత్రం ఎందుకు కాలేము? త్వరలో జరుగబోయే ఎన్నికలలో గెలిచి మళ్ళీ నేనే ముఖ్యమంత్రి అవుతానని సిఎం కెసిఆర్‌ చెప్పారు. ఆ ఎన్నికలలో మనమూ పోటీ చేసి గెలుద్దాము. ఎన్నికల తరువాత మన రక్షణ ఎవరు చూస్తారని కెసిఆర్‌ను అడుగుదాము. ఎన్నికల ఫలితాలు వచ్చేక ఎవరి అవసరం ఎవరికి ఉంటుందో చూద్దాం. ఇన్షా అల్లా... మనమే ముఖ్యమంత్రి అవుతామేమో? రాజకీయాలు అంటే మన ఇంట్లో పనిమనిషి వంటివి. వాటిని నియంత్రించే శక్తి మన చేతుల్లోనే ఉండాలి,” అని అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. 

అంటే ఈసారి ఎన్నికలలో టిఆర్ఎస్‌కు పూర్తి మెజారిటీ రాకపోవచ్చునని, అప్పుడు మజ్లీస్ మద్దతు కోరుతుందని, ఆ పరిస్థితే వస్తే ముఖ్యమంత్రి పదవి తమకే ఇవ్వాలని కోరాలని మజ్లీస్ పార్టీ భావిస్తున్నట్లు అర్ధమవుతోంది. లేదా ఒకవేళ టిఆర్ఎస్‌, కాంగ్రెస్ పార్టీలలో రెంటికీ ప్రభుత్వం ఏర్పాటుకు సరిపడినన్ని సీట్లు సాధించలేకపోతే, అప్పుడు కర్ణాటక ఫార్ములాను అమలుచేసి ముఖ్యమంత్రి పదవి పొందాలని మజ్లీస్ అధినేతలు భావిస్తున్నట్లు అర్ధమవుతోంది. 

ఈసారి ఎన్నికలలో టిఆర్ఎస్‌ 100కు పైగా సీట్లు సాధించుకోవడం ఖాయమని సిఎం కెసిఆర్‌ నమ్మకంగా చెపుతుంటే, మజ్లీస్ పార్టీ ఈవిధంగా మాట్లాడటం విశేషం. 


Related Post