టిడిపితో పొత్తులకు సిద్దం: ఉత్తమ్ కుమార్ రెడ్డి

September 07, 2018


img

కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తూ ఆవిర్భవించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అప్పటి నుంచి నేటి వరకు ఆ పార్టీ అదే వైఖరిని కొనసాగిస్తోంది. కానీ కర్ణాటక ఎన్నికల తరువాత బద్ద శత్రువైన కాంగ్రెస్‌ పార్టీతో చేతులు కలపడానికి చంద్రబాబు నాయుడు సిద్దమని సంకేతాలు ఇవ్వడంతో, దానికోసం తెర వెనుక ప్రయత్నాలు దాదాపు పూర్తయ్యాయి. అందుకే టిడిపితో పొత్తులకు సిద్దమని టి-పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈరోజు ప్రకటించారు.

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఇదేపనిమీద శనివారం హైదరాబాద్‌ రానున్నారు. ఆయన రేపు ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితర కాంగ్రెస్‌ ముఖ్యనేతలతో సమావేశం కానున్నారు. ఆ సమావేశంలో రెండు పార్టీలు ఎన్నికల పొత్తులపై చర్చించిన తరువాత అధికారిక ప్రకటన చేయవచ్చు. ఆ తరువాత టి-కాంగ్రెస్‌, టిటిడిపి నేతలు సీట్ల సర్ధుబాట్లపై ఒక అవగాహనకు రావలసి ఉంటుంది. 

తెలంగాణాలో టిడిపికి బలమైన క్యాడర్ ఉన్నందున ఆ పార్టీతో పొత్తులు పెట్టుకొన్నట్లయితే కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆలోచన కావచ్చు. కానీ టిడిపితో పొత్తులు పెట్టుకొన్నాక టిఆర్ఎస్‌ నేతలు చేయబోయే వాదనలను వారు బలంగా త్రిప్పికొట్టగలరా? టిడిపితో రాష్ట్ర బిజెపి నేతలు ఎందుకు సంబందాలు తెంచుకొన్నారో కాంగ్రెస్‌ నేతలు తెలియదనుకోలేము.

అలాగే రాష్ట్ర ప్రజలలో టిడిపి పట్ల కొంత వ్యతిరేకత నెలకొన్న సంగతి అందరికీ తెలిసిందే. కారణాలు అందరికీ తెలుసు. ఈ నేపద్యంలో టిడిపితో పొత్తులు పెట్టుకొంటే కాంగ్రెస్ పార్టీకి లాభమా నష్టమా? రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు అందరూ టిడిపితో పొత్తులకు సముఖంగానే ఉన్నారా లేదా? అని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆలోచించుకొంటే మంచిదేమో? తెలంగాణాలో టిడిపితో పొత్తులకు కాంగ్రెస్ పార్టీ సిద్దపడుతున్నప్పటికీ ఏపీలో కాంగ్రెస్ పార్టీ నేతలు టిడిపితో పొత్తులకు విముఖత చూపుతుండటం విశేషం.


Related Post