కెసిఆర్‌ తిట్టేది వాళ్ళనే...తెచ్చుకొనేది వాళ్ళనే

September 07, 2018


img

తెలంగాణా శాసనసభ రద్దు చేసిన తరువాత సిఎం కెసిఆర్‌ కాంగ్రెస్ పార్టీని ఎంతగా తిట్టిపోశారో అందరూ చూశారు. ఆనాటి నెహ్రూ మొదలు నేటి రాహుల్ గాంధీ వరకు అందరూ తెలంగాణాకు అన్యాయం చేసినవారేనని తిట్టిపోశారు. రాష్ట్ర విభజనకు ముందు తెలంగాణాలో నెలకొన్న దుస్థితికి కాంగ్రెస్‌ పాలకులే కారణమని గట్టిగా వాదించారు.   ఈరోజు హుస్నాబాద్ లో జరిగిన ‘ప్రజా ఆశీర్వాద సభ’లో కూడా కాంగ్రెస్‌ ప్రభుత్వం కారణంగానే తెలంగాణాకు అటువంటి దుస్థితి పట్టిందని, మళ్ళీ దానికి అధికారం కట్టబెడితే నాలుగేళ్ల తమ శ్రమ బూడిదలో పోసిన పన్నీరుగా మారుతుందని అన్నారు. 

కాంగ్రెస్‌ నేతలు సన్నాసులు, దద్దమ్మలు, అసమర్ధులు, అవినీతిపరులు, వారి కారణంగానే తెలంగాణాకు ఈ దుస్థితి పట్టిందని సిఎం కెసిఆర్‌ గట్టిగా వాదిస్తున్నప్పుడే మరోపక్క మంత్రి కేటీఆర్  సీనియర్ కాంగ్రెస్‌ నేత, మాజీ శాసనసభ స్పీకర్ సురేశ్ రెడ్డి ఇంటికి వెళ్ళి ఆయనను టిఆర్ఎస్‌లో చేర్చుకోవడం గమనిస్తే టిఆర్ఎస్‌ ద్వంద వైఖరి కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది. సురేశ్ రెడ్డికి కూడా కెసిఆర్‌ చెప్పినవన్నీ వర్తిస్తాయి కదా? ఆయన కూడా తెలంగాణాకు అన్యాయం చేసిన కాంగ్రెస్‌ ప్రభుత్వంలో భాగస్వామిగానే ఉండేవారు కదా? మరి తెలంగాణాకు అన్యాయం చేసిన పార్టీకి చెందిన నేతలనే మళ్ళీ టిఆర్ఎస్‌లోకి ఎందుకు ఆహ్వానిస్తున్నట్లు? వారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు సన్నాసులు, దద్దమ్మలు, అసమర్ధులు, అవినీతిపరులుగా కనిపించినప్పుడు టిఆర్ఎస్‌లోకి రాగానే నీతిమంతులు, సమర్ధులుగా మారిపోతారా? అని సందేహం కలుగకమానదు. 

సురేశ్ రెడ్డి టిఆర్ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించిన తరువాత ఒక విలేఖరి “మీ కుటుంబంలో నుంచి మూడు తరాలవారు కాంగ్రెస్ పార్టీతో అనుబందం పెనవేసుకొన్నారు. ఆ పార్టీని, కాంగ్రెస్‌ ప్రభుత్వాలను, వాటి పాలనను,  నెహ్రూ, ఇందిరాగాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో సహా కాంగ్రెస్‌ నేతలందరికీ సిఎం కెసిఆర్‌ తిట్టిపోస్తున్నారు. మీ పార్టీ అసమర్ధ, అవినీతి పాలన కారణంగానే దేశానికి, తెలంగాణా రాష్ట్రానికి ఈ దుస్థితి కలిగిందని ఆరోపిస్తున్నారు కదా? దీనిపై మీ స్పందన ఏమిటి?” అని ప్రశ్నించగా సురేశ్ రెడ్డి సమాధానం చెప్పలేకపోయారు. తెలంగాణాలో జరుగుతున్న అభివృద్ధికి ఆటంకం కలుగకూడదనే టిఆర్ఎస్‌లో చేరుతున్నానని పొంతలేని సమాధానం చెప్పారు. అయితే ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీని బలహీనపరచాలనే ఉద్దేశ్యంతోనే సురేశ్ రెడ్డిని టిఆర్ఎస్‌లోకి ఆహ్వానించారని, ఆయన ఏదో పదవులకు ఆశపడే చేరారనేది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. చివరాఖరిగా తేలేది ఏమిటంటే సిఎం కెసిఆర్‌ కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్‌ నేతలను ఎంత తిట్టిపోసినా టిఆర్ఎస్‌కు వారే దిక్కు అని!


Related Post