కెసిఆర్‌పై నారా లోకేశ్ విమర్శలు

September 07, 2018


img

ఏపీ రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ ఈరోజు ఆ రాష్ట్ర శాసనసభలో మాట్లాడుతూ సిఎం కెసిఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. “సిఎం కెసిఆర్‌ ఒకపక్క తెలుగువారందరూ కలిసి ఉండాలని చెపుతూనే మళ్ళీ జాగో బాగో అంటారు. టిఆర్ఎస్‌లో ఉన్నవాళ్ళలో  టిడిపి నేతలు ఎందరున్నారో అందరికీ తెలుసు. వారందరూ ఆంధ్రా ప్రజల ఓట్లు వేయించుకొని గెలిచినవారే కదా? వాళ్ళను సిఎం కెసిఆర్‌ తన పక్కన కూర్చొబెట్టుకోవడం లేదా? జిహెచ్ఎంసి ఎన్నికలలో టిఆర్ఎస్‌ ఘనవిజయం సాధించిందని కెసిఆర్‌ నిన్న గొప్పలు చెప్పుకొన్నారు. హైదరాబాద్‌లో స్థిరపడిన ఆంధ్రాప్రజలు ఓట్లు వేయడం వలననే కదా మీరు గెలవగలిగారు?” అని అన్నారు. 

జిహెచ్ఎంసి పరిధిలో ఆంధ్రాకు చెందిన చాలా మంది ప్రజలు స్థిరపడి ఉన్నందున వారు టిఆర్ఎస్‌కు ఓట్లు వేయరని కనుక టిఆర్ఎస్‌ ఓడిపోవడం ఖాయమని ప్రతిపక్షాలు భావించాయి. ఆ ఎన్నికలలో చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్ స్వయంగా ఎన్నికల ప్రచారం చేశారు. కనుక ఆంద్రా ప్రజలు టిడిపిని, అప్పుడు దానికి మిత్రపక్షంగా ఉన్న బిజెపిని గెలిపించి ఉండాలి. కానీ జిహెచ్ఎంసి ఎన్నికలలో టిఆర్ఎస్‌ గెలిచింది. టిడిపి, బిజెపిలు ఘోరంగా ఓడిపోయాయి. ఎందువలన? అని లోకేశ్ ప్రశ్నించుకొంటే బాగుంటుందేమో?


Related Post