ముందస్తు ఎన్నికలపై కేంద్ర ఎన్నికల కమీషనర్ వ్యాఖ్యలు

September 07, 2018


img

తెలంగాణా శాసనసభను రద్దు చేసినట్లు తమకు అధికారికంగా సమాచారం అందిందని కేంద్ర ఎన్నికల కమీషనర్ ఓపి రావత్ తెలియజేశారు. ఈరోజు డిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, “సాధారణంగా శాసనసభ రద్దు అయినప్పటి నుంచి 6 నెలలలోపు ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయవలసి ఉంటుంది. అయితే ఆరు నెలలు సమయం అనేది రాజ్యాంగం ప్రకారం ఇచ్చిన గడువు మాత్రమే కనుక అంతవరకు వేచి చూడనవసరంలేదని, శాసనసభ రద్దు కాగానే వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. ఇంతవరకు తెలంగాణా రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం శాసనసభ రద్దుతో ఆపద్ధర్మ ప్రభుత్వంగా మారింది. కనుక ఆరు నెలలు సమయం తీసుకొన్నట్లయితే అధికార దుర్వినియోగం జరిగే అవకాశం ఉంది. కనుక సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం తెలంగాణా రాష్ట్ర శాసనసభకు వీలైనంత త్వరలోనే ఎన్నికలు నిర్వహిస్తాము. రేపు ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారితో అన్ని విషయాలపై చర్చించిన తరువాత దీనిపై తగిన నిర్ణయం తీసుకొంటాము. గ్రహాలు, నక్షత్రాలు,  శుభదినాలను మేము పరిగణనలోకి తీసుకోము. ఆ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను బట్టి, అక్కడి ఎన్నికల సంఘం సంసిద్దతను బట్టే నిర్ణయం తీసుకొంటాము,” అని చెప్పారు. 

ఓపి రావత్ చెప్పిన దానిని బట్టి సిఎం కెసిఆర్‌ చెప్పిన సమయానికే లేదా ఇంకా ముందుగానే ఎన్నికలు నిర్వహించవచ్చని అర్ధం అవుతోంది. కనుక అంతా సిఎం కెసిఆర్‌ అనుకొన్నట్లుగానే జరుగుతోందని భావించవచ్చు.


Related Post