నా ప్రజల కోసం త్యాగం చేశాను: కెసిఆర్‌

September 06, 2018


img

సుమారు తొమ్మిది నెలలు ముందుగా శాసనసభను రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళుతున్నారనే ప్రతిపక్షాల ప్రశ్నలకు, ప్రజల సందేహాలకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఊహించినట్లుగానే తనదైన శైలిలో జవాబు చెప్పారు. శాసనసభను రద్దు చేసిన తరువాత తెలంగాణా భవన్ లో మీడియాతో మాట్లాడుతూ, “తెలంగాణా ఏర్పడిన కొత్తలో రాష్ట్రంలో ఎక్కడ చూసిన సమస్యలే కనబడేవి. ఎరువులు, విత్తనాలకు కరువు, రైతుల ఆత్మహత్యలు, నిత్యం కరెంటు కోతలు, ఆ కారణంగా మూతపడిన పరిశ్రమలు, హైదరాబాద్‌ నగరంలో మతకలహాలు, జిల్లాలో గూండాలు...రౌడీలు, గల్లీకో పేకాట క్లబ్బు, గుడంబా సెంటర్లు, ఊర్లలో గొడవలు...పంచాయితీలు, ఇలాగ అనేక సమస్యలతో రాష్ట్రం అస్తవ్యస్త పరిస్థితులు నెలకొని ఉండేవి. మేము అధికారంలోకి వచ్చేక ఒకటొకటిగా ఆ సమస్యలన్నిటినీ పరిష్కరించుకొంటూ రాష్ట్రాన్ని అభివృద్ధిపధంలోకి నడిపించాము. ఈ నాలుగేళ్ల వ్యవధిలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, అమలవుతున్న సంక్షేమ పధకాల కారణంగా తెలంగాణా రాష్ట్రం యావత్ దేశానికే ఆదర్శప్రాయంగా నిలిచింది. 

ఈ అభివృద్ధి నిరంతరంగా సాగిపోతుండాలి. అయితే మద్యలో అవినీతిపరులు, అసమర్ధులు అధికారంలోకి వస్తే మేము పడిన కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీరుగా మిగిలిపోతుంది. రాష్ట్రం కుక్కలు చించిన విస్తరిలా మారిపోయే ప్రమాదం ఉంది. అందుకే ఇది కొనసాగాలంటే అంకితభావంతో పనిచేసుకుపోతున్న టిఆర్ఎస్‌యే మళ్ళీ అధికారంలోకి రావాలి. అందుకే రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం మేము మా ప్రభుత్వాన్ని త్యాగం చేసి మళ్ళీ ప్రజల తీర్పు కోరుతూ ముందస్తు ఎన్నికలకు వెళుతున్నాము. ఈ నాలుగేళ్లలో మేము చేసిన అభివృద్ధి, అమలుచేసిన సంక్షేమ పధకాలు చూసి ప్రజలు కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తారనే భావిస్తున్నాము. ఈ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఎప్పటికీ ఇలాగే సాగలంటే ప్రజలే టిఆర్ఎస్‌ను గెలిపించుకోవాలి, “ అని కెసిఆర్‌ అన్నారు. 

తెలంగాణా ఏర్పడేనాటికీ నేటికీ ఉన్న పరిస్థితులలో చాలా తేడా ఉందనే కెసిఆర్‌ వాదనతో అందరూ ఏకీభవిస్తారు. ఖచ్చితంగా ఆ క్రెడిట్ ఆయనకే దక్కుతుంది. అయితే టిఆర్ఎస్‌ సర్కారు చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఎప్పటికీ కొనగాలంటే దాని కోసం తొమ్మిది నెలలు ముందుగా శాసనసభను రద్దు చేయవలసిన అవసరం ఏమిటి? ప్రజలందరూ టిఆర్ఎస్‌ వైపే ఉన్నారు...ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఖచ్చితంగా 100కు పైగా సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నప్పుడు 2019లోనే గడువు పూర్తయ్యాకనే ఎన్నికలకు వెళ్లవచ్చు కదా? ఆలోగా రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసి ఇంకా అనేక కొత్త కొత్త సంక్షేమ పధకాలు అమలుచేసి ప్రజలను మెప్పించవచ్చు కదా? అప్పుడు ప్రజలు 119 స్థానాలలో టిఆర్ఎస్‌నే గెలిపించవచ్చు కదా? 

సిఎం కెసిఆర్‌ రాజకీయ లెక్కలు అన్ని సరిచూసుకొన్నాక ఇప్పుడు ముందస్తు ఎన్నికలకు వెళితేనే ఎక్కువ లాభం ఉంటుందని నిర్ధారించుకొని శాసనసభను రద్దు చేసి ప్రజల కోసం తన ప్రభుత్వాన్ని త్యాగం చేశానని చెప్పుకోవడం లౌక్యమే. శాసనసభ రద్దుకు ఆయన చెప్పిన కారణం సహేతుకంగా లేదని అర్ధమవుతూనే ఉంది. కానీ చెప్పడానికి మరే కారణం లేనప్పుడు ఏదో ఒకటి చెప్పుకోక తప్పదు కదా! 


Related Post