సెల్ఫ్ గోల్ చేసుకొన్న కేంద్రం

September 06, 2018


img

సుమారు ఏడాదిన్నరగా కేంద్రప్రభుత్వం జమిలి ఎన్నికల గురించి గట్టిగా మాట్లాడుతోంది. అన్ని రాష్ట్రాల శాసనసభ, లోక్‌సభకు కలిపి జమిలి ఎన్నికలు నిర్వహించడం వలన మళ్ళీ 5 ఏళ్ళ వరకు రాజకీయాల గురించి ఆలోచించనవసరం లేకుండా పాలనపై దృష్టిపెట్టి పనిచేసుకోవచ్చునని, జమిలి ఎన్నికల వలన వేలకోట్ల ప్రజాధనం మిగులుతుందంటూ జమిలి ఎన్నికల వలన కలిగే లాభాల గురించి ప్రధాని మోడీతో సహా కేంద్రమంత్రులు ప్రజలకు, రాజకీయ పార్టీలకు వివరించి నచ్చజెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. జమిలి ఎన్నికల నిర్వహణ గురించి ఎన్నికల కమీషన్ కు లేఖ కూడా వ్రాసి సాధాసాధ్యాలను పరిశీలించవలసిందిగా కేంద్రప్రభుత్వం కోరింది. 

జమిలి ఎన్నికల ప్రతిపాదనను తెరపైకి తెచ్చిన ప్రధాని మోడీ, దానికి గట్టిగా మద్దతు ఇచ్చిన తెలంగాణా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఇద్దరూ తాము చెప్పినదానికి భిన్నంగా తెలంగాణా శాసనసభకు ముందస్తు ఎన్నికలు నిర్వహించడానికి సిద్దపడ్డారు. అంటే ఇప్పటి వరకు వారు చెప్పినదంతా కాలక్షేపం కోసమేననుకోవాలేమో? 

ఇక ఐదేళ్లు పాలించమని టిఆర్ఎస్‌కు ప్రజలు అధికారం కట్టబెడితే, ఎటువంటి బలమైన కారణం లేకుండానే ముందస్తు ఎన్నికలకు వెళ్ళడం వలన ప్రజలపై అధనపు భారం మోపినట్లేనని చెప్పవచ్చు. కెసిఆర్‌ తన నిర్ణయాన్ని గట్టిగా సమర్ధించుకోవచ్చు కానీ రాజకీయ ప్రజాస్వామ్యవాదులు ఎవరూ హర్షించరు...సమర్ధించరని చెప్పవచ్చు. అసలు జమిలి ఎన్నికల ప్రతిపాధన ప్రభుత్వానికి తెచ్చి దానిపై చర్చ మొదలుపెట్టిందే ప్రధాని మోడీ. కానీ ఇప్పుడు ఆయనే స్వయంగా అందుకు భిన్నంగా తెలంగాణా శాసనసభ ఎన్నికలకు అనుమతించి సెల్ఫ్ గోల్ చేసుకొన్నారు. రేపు కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు ఇదే విషయంపై ప్రధాని మోడీని నిలదీసి ప్రశ్నించకుండా ఉంటాయా? 


Related Post