టిఆర్ఎస్‌కు కొత్త శత్రువు!

September 06, 2018


img

ఇప్పటికే రాజకీయంగా అనేకమంది శత్రువులున్న టిఆర్ఎస్‌కు మరో కొత్త శత్రువు పుట్టాడు. ఆయనే శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామి. ఆయనపై విధించిన నగర బహిష్కరణను హైకోర్టు ఎత్తివేయడంతో బుధవారం ఆయన హైదరాబాద్‌ తిరిగి వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు నగర శివార్లలో విశ్వహిందూ పరిషత్‌, భజరంగ్‌దళ్‌, ఏబీవీపీ తదితర సంఘాలు, బిజెపి నేతలు, వేలాదిమంది భక్తులు, అనుచరులు ఆయనకు దారి పొడవునా పూలమాలలతో, హారతులతో ఘనంగా స్వాగతం పలికారు. 

ఈ సందర్భంగా ఆయన వారిని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “గూండాలకు, సంఘ విద్రోహులకు, దేశద్రోహులకు నగర బహిష్కరణ శిక్ష విధిస్తుంటారు. రాష్ట్ర ప్రభుత్వం నన్ను కూడా ఆకోవకే చెందిన వ్యక్తిగా పరిగణించి నాకు నగర బహిష్కరణ శిక్ష విధించింది. అయితే ధర్మం వైపే న్యాయం ఉంటుందని న్యాయస్థానం నిరూపించింది. నేను ఈరోజు ఉంటాను రేపు ఉండకపోవచ్చు. హిందువులలో ఐక్యత సాధించడానికి నేను ప్రాణాలు ఉన్నంతవరకు కృషి చేస్తూనే ఉంటాను. హిందువుల మద్య ఐక్యత కుదిరితే హైదరాబాద్‌లోనే హిందూ మహాసముద్రం సాక్షాత్కరిస్తుంది. 

ఎన్నికలు ఎప్పుడైనా పెట్టుకోమనండి. బాసర నుంచి భద్రాచలం వరకు ఖమ్మం నుంచి ఆదిలాబాద్ వరకు అన్ని జిల్లాలో ఈసారి కాషాయ జెండా ఎగురవేసి తీరుతాను. అందుకు నావంతు కృషి నేను చేస్తాను. 

ప్రభుత్వం అంటే నాకు చాలా గౌరవం ఉంది. కానీ పాలకులు తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే ప్రభుత్వం అంటే రాజకీయ పార్టీ కాదు. ప్రభుత్వం అంటే ప్రజలు. వారికి అనుకూలంగా పాలకులు వ్యవహరించాలి కానీ వారిపై ఆధిపత్యం చెలాయించాలనుకోకూడదు. అలాంటి ఆలోచనలు చేస్తే ప్రజలు సహించరు,” అని పరిపూర్ణానంద స్వామి అన్నారు. 

తెలంగాణాలో కాషాయ జెండా ఎగురవేయడమంటే బిజెపికి మద్దతు ఇస్తానని చెప్పుతున్నట్లుగానే భావించవచ్చు.  ఆయన టిఆర్ఎస్‌ను ఏమీ చేయలేకపోవచ్చు. కానీ వచ్చే ఎన్నికలలో దానికి ఎంతో కొంత నష్టం కలిగించగలరని చెప్పవచ్చు. రాజకీయాలకు దూరంగా ఉండే ఆయనకు నగర బహిష్కరణ శిక్ష విధించి టిఆర్ఎస్‌ చేజేతులా బలమైన ఒక కొత్త శత్రువును సృష్టించుకొందని చెప్పక తప్పదు. కనుక ఇది టిఆర్ఎస్ స్వయంకృతాపరాధమేనని భావించాల్సి ఉంటుంది.


Related Post