పాలమూరు నుంచి బిజెపి ఎన్నికల శంఖారావం

September 05, 2018


img

ముందస్తు ఎన్నికలు దాదాపు నిశ్చయమైనందున టిఆర్ఎస్‌తో సహా రాష్ట్రంలో అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారానికి సిద్దం అవుతున్నాయి. ఈ నెల 12 లేదా 13వ తేదీన పాలమూరు పట్టణంలో బిజెపి తొలి ఎన్నికల ప్రచారసభ నిర్వహించబోతోందని ఆ పార్టీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి ప్రకటించారు. దీనికి బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హాజరయ్యి పార్టీకి దిశానిర్దేశం చేస్తారని చెప్పారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు బిజెపి సిద్దంగా ఉందని చెప్పారు. ఈ ఎన్నికలను తాము ఆషామాషీగా తీసుకోవడం లేదని, ఈసారి ఎలాగైనా  గెలిచి అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా వ్యూహాలు సిద్దం చేసుకొంటున్నామని చెప్పారు. టిఆర్ఎస్‌ అభ్యర్ధులను డ్డీకొని ఓడించగల బలమైన అభ్యర్ధులని నిలబెట్టబోతున్నామని చెప్పారు.

టిఆర్ఎస్‌ సర్కారు వైఫల్యాలను ఎండగట్టాలని, టిఆర్ఎస్‌ను ఎదుర్కోవడంలో ఏమాత్రం వెనుకడుగు వేయవద్దని అమిత్ షా తమకు సూచించారని కిషన్ రెడ్డి చెప్పారు. మజ్లీస్ సూచన మేరకే సిఎం కెసిఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళుతున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. ఆవిధంగా చేస్తేనే తాము టిఆర్ఎస్‌కు మద్దతు ఇస్తామని మజ్లీస్ చెప్పినందునే సిఎం కెసిఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళుతున్నారని కిషన్ రెడ్డి అన్నారు.

సుమారు 9 నెలల ముందుగా శాసనసభను రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్ళాలనుకొంటున్నారో సిఎం కెసిఆర్‌ ప్రజలకు చెప్పవలసి ఉంది. కారణాలు ఏవైనప్పటికీ ఆయన ప్రధాని మోడీ ఆమోదం తీసుకొనే ఆయన ముందస్తు ఎన్నికలకు వెళుతున్నారనేది కిషన్ రెడ్డికి కూడా తెలుసు. కనుక ముందస్తు ఎన్నికల విషయంలో మజ్లీస్ పార్టీ కంటే కేంద్రప్రభుత్వమే టిఆర్ఎస్‌కు ఎక్కువ సహకరిస్తోందని అర్ధమవుతోంది. ఒకవేళ కేంద్రం సహకరించకపోతే సిఎం కెసిఆర్‌ అసెంబ్లీని రద్దు చేయగలరేమో కానీ ముందస్తు ఎన్నికలకు వెళ్లలేరని కిషన్ రెడ్డికి తెలుసు. ఇది తెలిసి మజ్లీస్ సూచన మేరకే టిఆర్ఎస్‌ ముందస్తు ఎన్నికలకు వెళుతోందని వాదించడం హాస్యాస్పదంగా ఉంది.       



Related Post