రేవంత్ రెడ్డి సరికొత్త వాదన అందుకేనా?

September 04, 2018


img

కాంగ్రెస్‌ నేత రేవంత్ రెడ్డి హైదరాబాద్‌ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఒక సరికొత్త వాదన తెరపైకి తెచ్చారు. నీళ్ళు, నిధులు, నియామకాలలో తెలంగాణాకు అన్యాయం జరుగుతోంది కనుకనే తెలంగాణా రాష్ట్రం కోసం అందరూ ఉద్యమించారనే సంగతి అందరికీ తెలుసు. కానీ ఆ మూడు టిఆర్ఎస్‌ పార్టీ నినాదాలే తప్ప వాటితో తెలంగాణా ప్రజలకు సంబందమే లేదని, టిఆర్ఎస్‌ నేతలు తమ ఆ వాదనలను తెలంగాణా ప్రజలపై బలవంతంగా రుద్దుతున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. నిజానికి తెలంగాణా ప్రజలు ఆత్మగౌరవం, సామాజిక న్యాయం కోరుకొంటున్నారని వాటి కోసమే ప్రజలు ఉద్యమించి తెలంగాణా రాష్ట్రం సాధించుకొన్నారని కానీ కెసిఆర్‌ పాలనలో ఆ రెండే కొరవడ్డాయని రేవంత్ రెడ్డి వాదించారు. 

రేవంత్ రెడ్డి ఏదో ఊసుపోక ఎన్నికలకు ముందు ఈ సరికొత్త వాదన మొదలుపెట్టారనుకోవడానికి లేదు. మొన్న ప్రగతి నివేదన సభలో సిఎం కెసిఆర్‌ ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ ‘మనం డిల్లీకి గులామీ చేయొద్దు. మన ఆత్మగౌరవం డిల్లీకి తాకట్టు పెట్టొద్దు’ అని అన్నారు. అంటే ‘కాంగ్రెస్ పార్టీకి ఓట్లేయొద్దు’ అని చెప్పడమే. బహుశః అందుకే కాంగ్రెస్ పార్టీ తరపున రేవంత్ రెడ్డి కూడా ఈ సరికొత్త వాదనను తెరపైకి తీసుకువస్తున్నట్లు భావించవచ్చు. అయితే సిఎం కెసిఆర్‌ చెపుతున్న ‘ఆత్మగౌరవం’ నినాదన్నే రేవంత్ రెడ్డి కూడా ఎందుకు ఎంచుకొన్నారనేది ప్రశ్న. 

కాంగ్రెస్‌ నేతలు డిల్లీ పెద్దలకు గులాములని టిఆర్ఎస్‌ వాదనకు కౌంటరుగా టిఆర్ఎస్‌ నేతలు కెసిఆర్‌ కుటుంబానికి గులాములుగా మారారని కనుక కాంగ్రెస్‌ను గెలిపించడం ద్వారా తెలంగాణా ప్రజల ఆత్మగౌరవం కాపాడుకొందామని నొక్కి చెప్పేందుకే రేవంత్ రెడ్డి ఈ వాదన మొదలుపెట్టి ఉండవచ్చు. ఇకపై టిఆర్ఎస్‌ నేతలు ఆత్మగౌరవం గురించి మాట్లాడిన ప్రతీసారి కాంగ్రెస్‌ నేతలు కూడా వారికి దీనితో ధీటుగా జవాబు చెప్పవచ్చు.   

ఇక సామాజిక న్యాయం అనే అంశం తెలంగాణా రాష్ట్రం ఏర్పడక ముందు నుంచి ఉంది. అందుకే 2014 ఎన్నికలలో చంద్రబాబు నాయుడు హటాత్తుగా బీసీ సంఘాల నేత ఆర్. కృష్ణయ్యను తెరపైకి తీసుకువచ్చి బీసీ ఓట్లు దండుకోవాలని ప్రయత్నించారు. ఈసారి ఎన్నికలలో మళ్ళీ తెలంగాణా సెంటిమెంటు రాజేసి లబ్దిపొందాలని టిఆర్ఎస్‌ ఆలోచిస్తున్నట్లు స్పష్టం అయ్యింది కనుక దానికి కౌంటరుగా కాంగ్రెస్ పార్టీ ‘సామాజిక న్యాయం’ అనే అంశాన్ని హైలైట్ చేయాలనుకొంటున్నట్లు కనిపిస్తోంది.


Related Post