రాష్ట్రంలో ఎన్నికలు వచ్చేసినట్లే!

September 04, 2018


img

ప్రగతి నివేదన సభ టిఆర్ఎస్‌ను కాస్త నిరాశపరిచినప్పటికీ సిఎం కెసిఆర్‌ వెంటనే తేరుకొని పార్టీకి తదుపరి కార్యాచరణ సిద్దం చేశారు. ఈ నెల 7వ తేదీ నుండి రోజుకు రెండు బహిరంగ సభలు చొప్పున ఏకధాటిగా 50 రోజులలో 100 బహిరంగసభలను నిర్వహించాలని నిర్ణయించారు. వాటికి ‘ప్రజల ఆశీర్వాద సభలు’ అని నామకరణం చేశారు. మొట్టమొదటి సభ సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ ఆర్టీసీ మైదానంలో నిర్వహించబోతున్నట్లు మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. తమ ప్రభుత్వం గత నాలుగేళ్ళలో రాష్ట్రాన్ని ఏవిధంగా అభివృద్ధి చేసిందో ముఖ్యమంత్రి కెసిఆర్‌ స్వయంగా ప్రజలకు వివరించి, టిఆర్ఎస్‌ను ఆశీర్వదించి రాబోయే ఎన్నికలలో మళ్ళీ గెలిపించమని కోరుతారని మంత్రి ఈటల చెప్పారు. వీటికోసం జిల్లాలు, మండలాలు వారిగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి-ఛార్జ్ లను నియమించి ప్రతీ ఇంటి నుంచి ప్రజలు వచ్చేలా జనసమీకరణ చేస్తామని చెప్పారు. సిఎం సభల పూర్తి షెడ్యూల్ త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. 

సిఎం కెసిఆర్‌ ఏకధాటిగా ఇన్ని బహిరంగసభలను నిర్వహించి ప్రజల ఆశీర్వాదం కోరడానికి అర్ధం ఏమిటో అందరికీ తెలుసు. సెప్టెంబరులోనే టిఆర్ఎస్‌ అభ్యర్ధుల పేర్లను ఖరారు చేస్తామని ముందే ప్రకటించారు. కనుక ఆ సభలలో వారిని ప్రజలకు పరిచయం చేసి వారిని ఆశీర్వదించవలసిందిగా కోరబోతున్నారని భావించవచ్చు.  

సిఎం కెసిఆర్‌ నిర్వహించబోయే సభలు నవంబరునాటికి పూర్తవుతాయి. డిసెంబరులో 15వ తేదీలోగా బిజెపి పాలిత రాష్ట్రాల ఎన్నికలు జరుగుతాయి. కనుక వాటితో పాటే తెలంగాణా అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరుగబోతున్నాయని స్పష్టం అవుతోంది. 


Related Post