సిఎం కెసిఆర్‌కు డిఎస్ సవాల్

September 04, 2018


img

గత రెండు నెలలుగా మౌనంగా ఉన్న టిఆర్ఎస్‌ నేత డి.శ్రీనివాస్ ఈరోజు నేరుగా సిఎం కెసిఆర్‌పై యుద్దం ప్రకటించారు. ఆయన నిజామాబాద్ లో మీడియా సమావేశం నిర్వహించి టిఆర్ఎస్‌ నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఎటువంటి తప్పు చేయకపోయినా పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నానని ఆరోపిస్తూ ఎంపీ కవిత, జిల్లాకు చెందిన టిఆర్ఎస్‌ నేతలు సిఎం కెసిఆర్‌కు ఫిర్యాదు చేయడాన్ని ఆయన తప్పు పట్టారు. ఒకవేళ తాను తప్పు చేసినట్లు సిఎం కెసిఆర్‌ భావిస్తే, తాను పార్టీలో ఉండటం కవితకు, జిల్లా నేతలకు ఇష్టం లేనట్లయితే, తనను తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని లేకుంటే తనపై చేసిన ఫిర్యాదులను ఉపసంహరించుకోవాలని సిఎం కెసిఆర్‌కు సవాల్ విసిరారు. తాను టిఆర్ఎస్‌ను విడిచి పెట్టి వెళితే తనపై టిఆర్ఎస్‌ నేతలు చేస్తున్న ఆరోపణలు నిజమని ఒప్పుకొన్నట్లు అవుతుంది కనుక  తనంతట తానుగా టిఆర్ఎస్‌ను విడిచిపెట్టవెళ్లబోనని చెప్పారు.

తన కొడుకు అరవింద్ బిజెపిలో చేరుతున్నాడని సిఎం కెసిఆర్‌కు ముందుగానే తెలియజేశానని చెప్పారు. అతను బిజెపిలో చేరుతునప్పుడు తన అనుచరులు ఎవరినీ బిజెపిలో చేరమని ప్రోత్సాహించలేదని చెప్పారు. ఇక తన మరో కుమారుడు సంజయ్ పై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలు తమను రాజకీయంగా దెబ్బ తీయడానికి జరిగిన కుట్రగా భావిస్తున్నానని అన్నారు. ఈ ఆరోపణలు, కేసుతో తమ కుటుంబాన్ని టిఆర్ఎస్‌ సర్కారు రోడ్డుకీడ్చిందని డిఎస్ ఆవేదన వ్యక్తం చేశారు. సుదీర్గమైన తన రాజకీయ జీవితంలో ఇంతటి అవమానకర పరిస్థితులను ఎన్నడూ ఎదుర్కొలేదని అన్నారు. తన రాజకీయజీవితం తెరిచిన పుస్తకం వంటిదని, తన గురించి సిఎం కెసిఆర్‌తో సహా అందరికీ తెలుసునని అన్నారు. తను ఎప్పుడు ఏ పార్టీలో ఉన్నప్పటికీ పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి ఉండేవ్యక్తినని డిఎస్ అన్నారు. తాను పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించినట్లు సిఎం కెసిఆర్‌ భావిస్తే తక్షణం పార్టీ నుంచి సస్పెండ్ చేయవచ్చని అన్నారు. ఆయన తన ఆలోచనలను ఆవేదనను మీడియాతో పంచుకోవడమే కాకుండా ఒక బహిరంగలేఖ ద్వారా కూడా టిఆర్ఎస్‌ సర్కారు దృష్టికి తీసుకువెళ్ళే ప్రయత్నం చేశారు. 

దాదాపు రెండు నెలలు మౌనంగా ఉన్న డిఎస్ ఇప్పుడు ఈవిధంగా ఎందుకు స్పందిస్తున్నారు? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అందుకు బలమైన కారణాలే కనిపిస్తున్నాయి. సిఎం కెసిఆర్‌ మరో రెండు మూడు రోజులలో శాసనసభను రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్ళే ఆలోచనలో ఉన్నారు. రెండు నెలలు గడిచినా సిఎం కెసిఆర్‌ తనకు అపాయింట్ మెంట్ ఇవ్వకుండా, ఎటువంటి నిర్ణయమూ తీసుకోకుండా పెండింగులో ఉంచడం వలన పార్టీలో తండ్రీ కొడుకుల పరిస్థితి ఏమిటో వారికే తెలియడం లేదు. కనుక పార్టీలో తమ స్థానం ఏమిటో తెలుసుకోవాలనుకొని ఉండవచ్చు. ఒకవేళ టిఆర్ఎస్‌ తమను వద్దనుకొంటే వేరే పార్టీలోకి మారేందుకు ఇదే తగిన సమయం. కనుక డి శ్రీనివాస్ టిఆర్ఎస్‌తో తాడో పేడో తేల్చుకోవడానికి సిద్దపడి ఉండవచ్చు. ఎలాగూ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని సవాలు విసిరారు కనుక బహుశః త్వరలోనే సిఎం కెసిఆర్‌ ఆయన కోరిక తీర్చవచ్చు.


Related Post