టి-కాంగ్రెస్‌ మరో ఎన్నికల హామీ

September 04, 2018


img

టి-పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సోమవారం తన పార్టీ ముఖ్యనేతలతో కలిసి గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఆ సందర్భంగా ఆయన మరో కొత్త హామీని ప్రకటించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే మొదటి సం.లోనే మెగా డి.ఎస్.సి నిర్వహిస్తామని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన మొదటి సం.లోనే ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో కలిపి మొత్తం లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. స్వయం ఉపాధి పధకాల ద్వారా మరో లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. 

తెలంగాణా రాష్ట్ర సాధన కోసం యువత బలిదానాలు చేస్తే, ఆ ఫలాలను కెసిఆర్‌ కుటుంబం అనుభవిస్తోందని అన్నారు. రాష్ట్రం ఏర్పడితే నిరుద్యోగ యువతకు భారీగా ఉద్యోగావకాశాలు లభిస్తాయనుకొంటే, కేవలం సిఎం కెసిఆర్‌ కుటుంబ సభ్యులకు మాత్రమే రాజకీయ ఉద్యోగాలు లభించాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు. సిఎం కెసిఆర్‌ అధికారంలోకి వచ్చిన తరువాత ఉద్యోగాల భర్తీ చేయకపోవడంతో యువత నిరాశానిస్పృహలకు లోనవుతున్నారని అన్నారు. 

కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగ భృతి ఇస్తానని ప్రకటించినప్పుడు అది ఆచరణ సాధ్యం కానీ హామీ అని వాదించిన సిఎం కెసిఆర్‌ ఇప్పుడు టిఆర్ఎస్‌ కూడా నిరుద్యోగ భృతి  ఇవ్వాలనుకొంటోందని ప్రకటించారని ఎద్దేవా చేశారు. నాలుగేళ్లుగా నిరుద్యోగులను పట్టించుకోని సిఎం కెసిఆర్‌కు ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడగానే హటాత్తుగా నిరుద్యోగులపై ప్రేమ పుట్టుకొచ్చిందా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మొట్ట మొదట ఉద్యోగాల భర్తీపైనే దృష్టి పెడతామని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.

ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన ఈ హామీలో చిన్న మెలిక కనిపిస్తోంది. లక్ష ప్రభుత్వోద్యోగాలు కల్పిస్తామని చెప్పకుండా ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో కలిపి లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పడం ఆనక తప్పించుకోవడానికి ముందుగా మార్గం ఏర్పాటు చేసుకోవడమే. 

టిఆర్ఎస్‌ సర్కారు నాలుగేళ్ల లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయలేనప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక్క ఏడాదిలోనే భర్తీ చేయడం ఏవిధంగా సాధ్యం? ఒకవేళ అది సాధ్యపడితే టిఆర్ఎస్‌ సర్కారే ఆ పనిచేసి యువతను ప్రసన్నం చేసుకొని ఉండేది కదా! అందుకే ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో కలిపి లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇస్తున్నారని అర్ధం అవుతోంది. అయితే తక్కువజీతాలు, ఉద్యోగభద్రత ఉండని ప్రైవేట్ రంగాలలో ఉద్యోగాలను కల్పించడం గొప్ప విషయమేమీ కాదు. పైగా ఆ పని ప్రభుత్వమే చేయనవసరం లేదు. రూ.5-10,0000 జీతం వచ్చే చిరుద్యోగాలను యువతే స్వయంగా వెతుకొని సంపాదించుకోగలదు. కనుక వాటిని పరిగణనలోకి తీసుకోలేము. తీసుకోదలిస్తే టిఆర్ఎస్‌ సర్కారు కూడా ఈ నాలుగేళ్లలో 2-3లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించిందని చెప్పవచ్చు. కనుక కాంగ్రెస్‌ ఆధికారంలోకి వస్తే ఎన్ని ప్రభుత్వోద్యోగాలు కల్పిస్తుందో ఉత్తమ్ కుమార్ రెడ్డి నిర్ధిష్టంగా చెపితేనే దానిని సిసలైన హామీగా భావించవచ్చు.


Related Post