నేతల గుట్లు నేతలకే ఎరుక!

September 03, 2018


img

రాజకీయ నేతలు అందరూ తాము నిష్కళంకమైనవారిమని, కేవలం ప్రజలకు సేవ చేయడానికే రాజకీయాలలోకి వచ్చామని చెప్పుకొంటుంటారు. ప్రజలు కూడా వారి మాటలను శ్రద్దగా వింటారు కానీ ఎవరు ఎటువంటివారో వారికి బాగానే తెలుసు. వారు తమను నిలదీసి ప్రశ్నించకుండా బుద్దిగా చెప్పిందల్లా వింటున్నారు కనుక నేతలు నీతులు వల్లె వేస్తూనే ఉంటారు. అయితే ఒక పార్టీలో నేత మరొకపార్టీలోకి మారినప్పుడు, ఆ రెండు పార్టీల నేతలు పరస్పరం చేసుకొనే విమర్శలు, ఆరోపణలతో వారి అవినీతిభాగోతాలు కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంటాయి. 

ఇటీవల కాంగ్రెస్‌ నుంచి టిఆర్ఎస్‌లోకి జంప్ చేసిన దానం నాగేందర్ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై కొన్ని విమర్శలు చేశారు. వాటికి ఆయన బదులిస్తూ, “ప్రభుత్వ భూములను కబ్జా చేసే ఆయనా... నన్ను విమర్శించేది? ఆయనకేదో పిచ్చిపట్టినట్లుంది. అటువంటి కబ్జాకోరు చేస్తున్న విమర్శలకు నేను బదులివ్వాలా? ముందు అతను టిఆర్ఎస్‌కు ఎంతకూ అమ్ముడుపోయారో చెపితే బాగుంటుంది,” అని అన్నారు. 

దానం నాగేందర్ భూకబ్జాలకు పాల్పడతారని ఇప్పుడు బయటపెట్టిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నంతకాలం ఆ గుట్టును బయటపెట్టలేదు. పైగా ఆయన అటువంటి వ్యక్తి అని తెలిసి ఉన్నప్పటికీ ఆయన కాంగ్రెస్ పార్టీ విడిచిపెట్టి టిఆర్ఎస్‌లోకి వెళ్ళిపోతున్నప్పుడు, కాంగ్రెస్‌ నేతలు ఆయనను బుజ్జగించే ప్రయత్నాలు చేయడం ప్రజలు కూడా చూశారు. 

ఇక దానం గురించి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన ఆరోపణలు నిజమనుకొంటే, దానం అటువంటి వ్యక్తి అని తెలిసి కూడా టిఆర్ఎస్‌ ఆయనను పార్టీలో చేర్చుకోవడం విశేషం. కాంగ్రెస్‌ నేతలు అందరూ అవినీతిపరులు, అసమర్దులని వాదిస్తున్న టిఆర్ఎస్‌ మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ నుంచి నేతలను తెచ్చుకొంటోంది. అంటే వారి అవినీతి, అసమర్దతత పట్ల టిఆర్ఎస్‌కు కూడా ఎటువంటి అభ్యంతరాలు లేవని భావించాల్సి ఉంటుంది. రాజకీయపార్టీలకు సదరు నేతలు ఆర్ధిక, అంగబలం ఎంతుందనే చూస్తాయి తప్ప వారి అవినీతిని చూడవని అర్ధమవుతోంది. కనుక ఎవరు ఏ పార్టీలో ఉన్నప్పటికీ వారిలో చాలా మంది ఒక తానులో ముక్కలే కనుక ఒకరి తెర వెనుక భాగోతాల గురించి మరొకరికి బాగానే తెలుసు. కానీ పార్టీలు మారినప్పుడే వారి భాగోతాల గురించి తెలుసుకొనే భాగ్యం సామాన్య ప్రజలకు కూడా కలుగుతుంటుంది.


Related Post