కెసిఆర్‌ వ్యూహం ఫలిస్తుందా?

September 03, 2018


img

రాష్ట్రంలో ప్రతిపక్షాలను ఫిరాయింపులతో ఒక పద్దతి ప్రకారం నిర్వీర్యం చేసి టిఆర్ఎస్‌కు ఎదురులేకుండా చేసుకోవాలని టిఆర్ఎస్‌ చేసిన ప్రయత్నాల వలన దానికి ఎంత లాభం కలిగిందో కాంగ్రెస్ పార్టీకి కూడా అంతే కలిగిందని చెప్పవచ్చు. ఏవిధంగా అంటే ఫిరాయింపుల వలన అది కూడా కొంత బలహీనపడినప్పటికీ, నేటికీ గట్టిగా నిలద్రొక్కుకొనే ఉంది కనుక ఇప్పుడు అది కేవలం టిఆర్ఎస్‌తో పోటీపడితే సరిపోతుంది. కాంగ్రెస్ పార్టీలో నుంచి అంతమంది టిఆర్ఎస్‌లోకి ఫిరాయించినపటికీ రాష్ట్రంలో టిఆర్ఎస్‌కు అది ఏకైక ప్రత్యామ్నాయంగా నిలిచి సవాలు విసురుతోంది. కనుక దానిని ఇంకా బలమైన అస్త్రంతో ఎదుర్కొనవలసి ఉంది లేకుంటే వచ్చే ఎన్నికలలో టిఆర్ఎస్‌ విజాయవకాశాలకు అది గండి కొట్టే ప్రమాదం ఉంది. బహుశః అందుకే సిఎం కెసిఆర్‌ నిన్న ప్రగతి నివేదన సభలో ‘తెలంగాణా ప్రజల ఆత్మగౌరవం’ అనే కొత్త ఆయుధాన్ని తీసి కాంగ్రెస్ పార్టీపై ప్రయోగించారు.       

“మనం డిల్లీ పెద్దలకు గులాములు కావద్దు. మన రాష్ట్రానికి సంబందించిన నిర్ణయాలన్నీ మనమే ఇక్కడే మన గడ్డ మీదమే తీసుకోవాలి. మన బాగోగులు, మంచిచెడ్డలు మనమే చూసుకొనే శక్తి, అధికారం మన చేతుల్లోనే ఉండాలి తప్ప ఎక్కడో డిల్లీలో ఉన్న వాళ్ళు కాదు. అప్పుడే మన ఆత్మగౌరవంతో జీవించగలుగుతాము. తెలంగాణా సమాజానికి మన టిఆర్ఎస్‌ సర్కారు ప్రతినిధిగా నిలబడి రాష్ట్రాభివృద్ధికి, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తోంది. అదే ఏ చిన్న నిర్ణయం తీసుకోవాలన్నా డిల్లీకి పరిగెత్తే పార్టీలకు ఓట్లు వేస్తే, ఇక డిల్లీ దొరలు మనపై సవారీ చేస్తారు. మనకేదీ కావాలన్నా వాళ్ళ గుమ్మాల దగ్గర పడిగాపులు కాస్తూ వారి దయాదాక్షిణ్యాల కోసం ఎదురు చూడవలసి వస్తుంది. కోట్లాడి తెలంగాణా సాధించుకొన్న మనం మళ్ళీ డిల్లీకి గులాములుగా ఉండాల్సిన అవసరం ఉందా? తెలంగాణా ఏర్పడి టిఆర్ఎస్‌ అధికారంలోకి వచ్చేక రాష్ట్రస్థాయిలోనే అన్ని నిర్ణయాలు జరుగుతున్నాయి కనుకనే ఇంత అభివృద్ధి సాధ్యం అయ్యింది. జరిగిన అభివృద్ధి మీ కళ్ళ ముందే ఉంది. కనుక మనం మన పార్టీనే మళ్ళీ గెలిపించుకొని మన ఆత్మగౌరవం కాపాడుకొందాము,” అని సిఎం కెసిఆర్‌ అన్నారు. 

సిఎం కెసిఆర్‌ చెప్పినది నూటికి నూరు పాళ్ళు నిజమే కానీ ఆయన వాదనలో టిఆర్ఎస్‌ రాజకీయ ప్రయోజనం కాపాడుకోవాలనే ఆలోచన కూడా ఇమిడి ఉంది. టిఆర్ఎస్‌కు ఏకైక ప్రత్యామ్నాయంగా నిలిచిన కాంగ్రెస్ పార్టీ ఈ అస్త్రంతో అడ్డుకోగలిగితే ఇక రాష్ట్రంలో టిఆర్ఎస్‌కు ఎదురే ఉండదు కదా! 

అయితే కాంగ్రెస్ నేతలు కూడా ఆయనకు ఒక ప్రశ్న సందించారు. ఒకపక్క ప్రధాని మోడీకి గులామీ చేస్తూ  తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని డిల్లీలో పణంగాపెట్టిన కెసిఆర్ కి ఇప్పుడు ఆత్మగౌరవం గురించి గుర్తు వచ్చిందా? అని అడుగుతున్నారు. వారి ప్రశ్నకు తెరాస నేతలు ఏమి సమాధానం చెపుతారో? 


Related Post