సాధ్యం కాదన్న నోటితోనే...నిరుద్యోగభృతి హామీ!

September 03, 2018


img

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో 10 లక్షలమంది నిరుద్యోగులకు నెలకు రూ.3,000 చొప్పున నిరుద్యోగ భృతి చెల్లిస్తామని టి-పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చినప్పుడు, టిఆర్ఎస్‌ మంత్రులు, నేతలు అది ఆచరణ సాధ్యం కానీ హామీ అని, ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి రావడానికే కాంగ్రెస్‌ నేతలు ఆ హామీని ఇస్తున్నారని వాదించారు. కానీ ఆదివారం ప్రగతి నివేదన సభలో సిఎం కెసిఆర్‌ మాట్లాడుతూ తమ ఎన్నికల మ్యానిఫెస్టోలో నిరుద్యోగ భృతి హామీని చేర్చేందుకు ఆలోచిస్తున్నామని చెప్పారు. 

కాంగ్రెస్ ప్రకటించినప్పుడు అది ఆచరణ సాధ్యం కాదని, కాంగ్రెస్ పార్టీ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తోందని గట్టిగా వాదించిన టిఆర్ఎస్‌ కూడా ఇప్పుడు అదే చేయాలనుకోవడానికి అర్ధం ఏమిటి? కాంగ్రెస్ హామీ ఇస్తే ప్రజలను మోసం చేయడం కోసం, టిఆర్ఎస్‌ ఇస్తే నిఖార్సైన హామీ అవుతుందా? అదే నిజమనుకొంటే టిఆర్ఎస్‌ అధికారంలోకి వస్తే దళితులకు 3 ఎకరాల భూమి, పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు వంటి హామీలు నేటికీ అమలుచేయలేదు కదా? 

టిఆర్ఎస్‌తో సహా ఏ రాజకీయ పార్టీ అయినా ఎన్నికలలో గెలిచి అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేస్తుంటుందని సిఎం కెసిఆర్‌ స్వయంగా కొంతకాలం క్రితం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కూడా అదే చేస్తున్నపుడు దానిని తప్పు పట్టడం దేనికి? ఉద్యోగాల భర్తీ విషయంలో టిఆర్ఎస్‌ సర్కారు తన హామీని నిలబెట్టుకోలేకపోయినందున యువతలో తీవ్ర అసంతృప్తి నెలకొన్న విషయాన్ని గ్రహించిన టి-కాంగ్రెస్ వారిని ఆకట్టుకోవడానికి నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించింది. ఆ కారణంగా రాబోయే ఎన్నికలలో యువత ఓట్లు కాంగ్రెస్ పార్టీకి మళ్ళిన్నట్లయితే టిఆర్ఎస్‌ చాలా నష్టపోతుంది. కనుకనే టిఆర్ఎస్‌ కూడా ఆచరణ సాధ్యం కాదని వాదించిన నిరుద్యోగ భృతి గురించి ఆలోచన చేయకతప్పడం లేదని చెప్పవచ్చు. 


Related Post