సెప్టెంబర్ 6న తెలంగాణా శాసనసభ రద్దు?

September 03, 2018


img

ఆదివారం సాయంత్రం జరిగిన ప్రగతి నివేదన సభకు కొన్ని గంటల ముందు సిఎం కెసిఆర్‌ హడావిడిగా మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో శాసనసభ రద్దు చేయాలని అనుకొన్నప్పటికీ, కొన్ని విధానపరమైన నిర్ణయాలు తీసుకోవలసి ఉన్నందున చివరి నిమిషంలో ఆ ఆలోచన విరమించుకొన్నట్లు సమాచారం. లేకుంటే నిన్ననే శాసనసభను రద్దు చేసి, ప్రగతి నివేదన సభలో ఎన్నికల శంఖారావం పూరించి ఉండేవారని టిఆర్ఎస్‌ నేతలు అంటున్నారు. అయితే సెప్టెంబరు 6వ తేదీన శాసనసభను రద్దు చేయడం ఖాయమని చెపుతున్నారు. ఆలోగా నేడో రేపో మళ్ళీ మంత్రివర్గ సమావేశం నిర్వహించి, విధానపరమైన నిర్ణయాలకు ఆమోదం తెలిపిన తరువాత శాసనసభ రద్దు చేయవచ్చని సమాచారం.

‘త్వరలో మళ్ళీ మంత్రివర్గ సమావేశం జరుగబోతోంది కనుక అన్ని శాఖలు తమ ప్రతిపాదనలను మంగళవారం సాయంత్రంలోగా పంపించాలని’ ఆదేశిస్తూ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎస్.కె.జోషి అన్ని శాఖల ముఖ్యకార్యదర్శులకు లేఖలు వ్రాశారు. కనుక త్వరలోనే మంత్రివర్గ సమావేశం నిర్వహించి ఆ ప్రతిపాధనలపై చర్చించి ఆమోదించిన తరువాత, సెప్టెంబర్ 6న మళ్ళీ మరొకసారి మంత్రివర్గ సమావేశం నిర్వహించి తెలంగాణా శాసనసభను రద్దు చేసే అవకాశం ఉందని సమాచారం.

శాసనసభను రద్దు చేయడం సిఎం కెసిఆర్‌ చేతిలో పనే. అయితే ఐదేళ్లు పాలించమని టిఆర్ఎస్‌కు ప్రజలు అధికారం కట్టబెడితే, 8 నెలల ముందుగా శాసనసభను రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్లాలనుకొంటున్నారు? అనే ప్రతిపక్షాల ప్రశ్నకు టిఆర్ఎస్‌ సర్కారు సంతృప్తికరమైన సమాధానం చెప్పవలసి ఉంది. లేకుంటే ప్రతిపక్షాలకు అదే ఒక ఆయుధంగా మారే అవకాశం ఉంటుంది. 


Related Post