నివేదనతోనే సరిపెట్టారు!

September 02, 2018


img

టిఆర్ఎస్‌ సర్కారు చాలా ప్రతిష్టాత్మకంగా, చాలా హడావుడిగా ఆదివారం సాయంత్రం కొంగరకలన్ లో అట్టహాసంగా నిర్వహించిన ‘ప్రగతి నివేదన’ సభ పేరును సార్ధకం చేస్తున్నట్లు సాగింది సిఎం కెసిఆర్‌ ప్రసంగం. గత 51 నెలలో తమ ప్రభుత్వం ఏమేమి విజయాలు సాధించిందో ఇక ముందు ఏమి సాధించాలనుకొంటోందో వివరించారు. తమ హయంలో రాష్ట్రం ఏవిధంగా అభివృద్ధి సాధిస్తోందో వివరించారు. 

ఇంత అట్టహాసంగా, ఇంత హడావుడిగా ప్రగతి నివేదన సభ నిర్వహించడంతో రాష్ట్ర ప్రజలే కాక ప్రతిపక్షాలు కూడా ఈ సభలో సిఎం కెసిఆర్‌ ఏమి చెప్పబోతున్నారోనాని చాలా ఆసక్తిగా ఆతృతగా ఎదురుచూశారు. ఈ సభలో సిఎం కెసిఆర్‌ రాష్ట్ర ప్రజలపై వరాల జల్లులు కురిపిస్తారని, ముందస్తు ఎన్నికల గురించి ఏదో చెప్పబోతున్నారని మీడియాలో ఊహాగానాలు రావడంతో ఈ సభకు చాలా హైప్ క్రియేట్ అయ్యింది. కానీ ఈరోజు ఆయన చెప్పిన ప్రతీ విషయమూ రాష్ట్ర ప్రజలందరికీ కంఠోపాఠమే. ఆయన కొత్తగా ఏమీ చెప్పకుండా అందరికీ తెలిసిన విషయాలే మరోసారి చెప్పి ‘జై తెలంగాణా!’అని ప్రసంగం ముగించడం అందరినీ నిరుత్సాహపరిచిందనే చెప్పకతప్పదు. అయితే రెండు మూడు కొత్త విషయాలు చెప్పారు. 

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నెలకు రూ.3,000 నిరుద్యోగ భృతి ఇస్తామని, ప్రస్తుతం ఇస్తున్న పెన్షలను రెట్టింపు చేస్తామని హామీ ఇస్తోంది కనుక టిఆర్ఎస్‌ కూడా ఆ దిశలో ఆలోచించక తప్పడం లేదు. ఆ రెండు హామీల గురించి సిఎం కెసిఆర్‌ ప్రస్తావించి, పెన్షన్ కొద్దిగా పెంచాలనుకొంటున్నామని, నిరుద్యోగభృతి ఇవ్వాలనుకొంటున్నామని, వాటి గురించి టిఆర్ఎస్‌ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటిస్తామని క్లుప్తంగా చెప్పారు. కె.కేశవ్ రావు నేతృత్వంలో టిఆర్ఎస్‌ ఎన్నికల మ్యానిఫెస్టో సిద్దం అవుతోందని, మళ్ళీ టిఆర్ఎస్‌ ఆధికారంలోకి వస్తే ఏమేమి చేస్తుందో దానిలో వివరిస్తామని సిఎం కెసిఆర్‌ చెప్పారు.  

ఇక ముందస్తు ఎన్నికల గురించి మీడియాలో వస్తున్న ఊహాగానాల గురించి ప్రస్తావిస్తూ, “తెలంగాణా రాష్ట్రానికి, ప్రజలకు, టిఆర్ఎస్‌కు ఏది ఎక్కువ మేలు చేస్తుందని భావిస్తే అదే చేస్తామని” చెప్పారు తప్ప ముందస్తు ఎన్నికలకు వెళ్ళబోతున్నారా లేదా అనే విషయం ఖచ్చితంగా చెప్పలేదు. ఈ సభలో సిఎం కెసిఆర్‌ తనదైన శైలిలో ప్రతిపక్షాలను చీల్చి చెండాడుతారని అందరూ అనుకొంటే ఆయన అటువంటి ప్రయత్నమే చేయకపోవడం ఆశ్చర్యకరమైన విషయమే. కానీ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశ్యించి మాట్లాడుతూ “రాష్ట్రంలో ఏపని మొదలుపెట్టాలన్నా డిల్లీ వైపు చూసే పార్టీ మనకు అవసరమా?” అని ప్రశ్నించారు. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే రాబోయే ఎన్నికలలో తమ పార్టీ 100 సీట్లు తప్పకుండా గెలుస్తుందని నిత్యం చెప్పే సిఎం కెసిఆర్‌ ఈ సభలో ఆ ఊసే ఎత్తలేదు. మొత్తం మీద ఈరోజు సభలో సిఎం కెసిఆర్‌ ప్రసంగం కాస్త చప్పగానే సాగిందని చెప్పక తప్పదు. 


Related Post