కెసిఆర్‌ని విమర్శిస్తే కాంగ్రెస్ గెలిచేస్తుందా?

September 01, 2018


img

కాంగ్రెస్‌ నేత పొన్నం ప్రభాకర్ ఈరోజు కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడుతూ, “టిఆర్ఎస్‌ సర్కారుపై మా జిల్లాకు... ప్రజలకు ఏమి చేసిందని ప్రగతి నివేదన సభకు తరలివెళ్ళాలి? అసలు ఆ సభ పెడుతున్నది ప్రజల కోసమా... ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం కోసమా లేక బస్సులు, ట్రాక్టర్ల వ్యాపారం కోసమా? అయినా టిఆర్ఎస్‌ సర్కారు రాష్ట్రంలో ఏమి ప్రగతి సాధించిందని ఈ ప్రగతి నివేదన సభ? రైతు భీమా పధకం అమలు చేయడం మొదలుపెట్టిన తరువాత రాష్ట్రంలో రోజుకు 31 మందీ రైతులు ఆత్మహత్యలు చేసుకొంటున్నారు. గత నెల రోజులలో రాష్ట్రంలో 541 మంది ఆత్మహత్యలు చేసుకొన్నారు. అయినా ప్రభుత్వం పట్టించుకోకుండా ఆర్భాటంగా ప్రగతి నివేదన సభ జరుపుకొంటోంది. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు చూస్తుంటే హెల్త్ ఎమర్జెన్సీ విధించాల్సిన అవసరం కనిపిస్తోంది,” అని విమర్శలు గుప్పించారు. 

కాంగ్రెస్ పార్టీ పదేళ్ళపాటు దేశాన్ని, సమైక్య రాష్ట్రాన్ని పాలించింది. దాని పాలన ముగిసేసరికి దేశంలో ఎక్కడ చూసినా రైతులు ఆత్మహత్యలు చేసుకొంటూనే ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు తీవ్ర విద్యుత్ సంక్షోభంలో కూరుకుపోయున్నాయి. ఆ కారణంగా క్రాప్ హాలీడేస్, పరిశ్రమలకు పవర్ హాలీడేస్ అంటూ గంటలు..రోజుల తరబడి  విద్యుత్ కోతలు విధిస్తుండేవారు. అయితే కాంగ్రెస్‌ పార్టీ అదృష్టం ఏమిటంటే “కాంగ్రెస్‌ పాలనలో ఇవన్నీ చాలా కామన్” అంటూ ఆ కష్టాలకు ప్రజలు అలవాటుపడిపోయారు తప్ప ఇదేమి దరిద్రపు పాలన? అని నిలదీయలేదు. ఇక కాంగ్రెస్‌ పాలన ముగిసిన తరువాత రాహుల్ గాంధీ స్వయంగా వివిద రాష్ట్రాలలో ఆత్మహత్యలు చేసుకొన్న రైతు కుటుంబాలను పరామర్శించారు. అంటే వారి ఆత్మహత్యలకు తమ అసమర్ధ పాలనే కారణమని  ఆయనే స్వయంగా చాటిచెప్పుకొన్నట్లు అయ్యింది. 

పదేళ్ళ కాంగ్రెస్‌ పాలన ముగిసేనాటికి ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాల పరిస్థితి ఏవిధంగా ఉందో ప్రజలందరికీ బహుశః నేటికీ ఇంకా గుర్తుండే ఉంటుంది. అటువంటి క్లిష్ట పరిస్థితులలో నుంచి రాష్ట్రాన్ని బయటకులాగి, అన్ని రంగాలలో దేశంలోనే నెంబర్: 1 స్థానంలో నిలిపితే అది యావత్ దేశ ప్రజలందరికీ కనిపిస్తోంది కానీ రాష్ట్రంలో కాంగ్రెస్‌ నేతలకు మాత్రం కనిపించడం లేదు. కానీ అదే కాంగ్రెస్‌ నేతలు టిఆర్ఎస్‌లో చేరగానే అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తుండటం విశేషం. 

పదేళ్ళపాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తన అసమర్ధతను, బాధ్యతారాహిత్యాన్ని రాష్ట్ర ప్రజలకు రుచి చూపిస్తే, రాష్ట్రం పట్ల, రాష్ట్ర ప్రజల పట్ల నిబద్దత, చిత్తశుద్ధి, వాత్సల్యం ఉన్న పాలకులు అధికారంలో ఉంటే పాలన ఎంత గొప్పగా ఉంటుందో సిఎం కెసిఆర్‌ రుచి చూపిస్తున్నారు. కనుక సిఎం కెసిఆర్‌ను ప్రశ్నించేముందు కాంగ్రెస్‌ నేతలు తమ హయాంలో రాష్ట్రానికి, ప్రజలకు ఏమి మేలు చేశామని ఒకసారి ఆలోచించుకొంటే బాగుంటుంది. కాదని విమర్శలు, నిరాధారమైన ఆరోపణలు చేస్తూనే ఉంటే, వారి పట్ల ప్రజలలో వ్యతిరేకత మరింత పెరిగే అవకాశం ఉంది. సిఎం కెసిఆర్‌ను లక్ష్యంగా చేసుకొని నిరంతరం విమర్శలు చేస్తూ ప్రజలను ఆకట్టుకోవాలని ప్రయత్నించే బదులు ఈసారి తమ పార్టీ అధికారంలోకి వస్తే ఏమేమి చేస్తుందో చెప్పుకొంటే ఏమైనా ప్రయోజనం ఉంటుంది. 


Related Post