విద్యుత్ ఉద్యోగులకు శుభవార్త

September 01, 2018


img

రాష్ట్రంలో విద్యుత్ ఉద్యోగులకు శుభవార్త. వారు ప్రభుత్వాన్ని 32 శాతం పి.ఆర్.సి. ఇవ్వాలని డిమాండ్ చేస్తే సిఎం కెసిఆర్‌ వారికి 35 శాతం ఇస్తున్నట్లు ప్రకటించారు. శనివారం సాయంత్రం ప్రగతి భవన్‌లో విద్యుత్ ఉద్యోగులతో సమావేశమైనప్పుడు సిఎం కెసిఆర్‌ వారిని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరువాత మీరందరూ రేయింబవళ్లు చాలా కష్టపడిపనిచేసి రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ సంక్షోభాన్ని రూపుమాపారు. తెలంగాణా రాష్ట్రానికి తొలి విజయం అందించిన ఘనత మీదే కనుక మీ అందరికీ అన్ని విధాలా న్యాయం జరగాలి. మీ ఉద్యోగ సంఘాల నేతలు 32 శాతం పి.ఆర్.సి. కావాలని అడుగుతుంటే మా ప్రభాకర్ గారు 25 శాతం వరకు ఇవ్వడానికి సిద్దపడ్డారు. కానీ ఇదివరకు 30 శాతం ఇచ్చినప్పుడు ఈసారి అంతకంటే ఎక్కువే ఇవ్వాలి కదా అందుకే ఆయన నామీద కాస్త కోపం తెచ్చుకొన్నా మీ అందరికీ 35 శాతం పి.ఆర్.సి.ఇవ్వాలని చెప్పాను. తెలంగాణాకు తొలి విజయం అందించిన మీరూ మీ కుటుంబాలు అందరూ సుఖంగా జీవించాలని నేను కోరుకొంటున్నాను.

మీకే ఎక్కువ జీతాలు ఎందుకు ఇస్తున్నాము...మాకెందుకు ఇవ్వరని మిగిలిన శాఖలవారు అడుగుతుంటారు. కానీ ప్రాణాలు పణంగా పెట్టి రేయింబవళ్ళు పనిచేసే మీతో పోలిక పెట్టుకోవద్దని వారికి చెపుతుంటాను. త్వరలోనే మీ అందరికీ హెల్త్ కార్డులు కూడా అందజేస్తాము. మా దృష్టికి వచ్చిన మీ ప్రతీ సమస్యను మా పరిధిలో మేము పరిష్కరించేందుకే నిజాయితీగా కృషి చేస్తున్నాము. అయితే చట్టాలు, ప్రభుత్వ నియమనిబంధనలు వగైరా ఉంటాయి కనుక కొన్నిసార్లు మీకు ఇంకా ఏదో చేయాలని ఉన్నా చేయలేకపోతుంటాము.

ఇక అవుట్ సౌర్సింగ్ పద్దతిలో పనిచేస్తున్న బిల్ కలెక్టర్ల సమస్యలను కూడా సానుభూతితో తప్పకుండా పరిష్కరిస్తాము. అందరికీ అన్ని చేసి మిమ్మల్ని మాత్రం ఎందుకు కాదనాలి? ఒక్క విద్యుత్ శాఖలోనే కాదు నా సిఏంఓలో కూడా అవుట్ సౌర్సింగ్ ఉద్యోగులున్నారు. మీ జీతాలు ఏవిధంగా కోతలు పెట్టి ఇస్తారో నాకు తెలుసు. ఆ సమస్యను పరిష్కరించి నేరుగా మీకే మొత్తం జీతం చెల్లించేలాగ ఏర్పాట్లు చేస్తాము. ఒకసారి మీరు మన ఎండి ప్రభాకర్ గారిని కలిసి మీ సమస్యలను ఆయనకు వివరించండి. విద్యుత్ శాఖలోని 50,000 మంది ప్రభుత్వోద్యోగులలో ఓ వెయ్యి మందికి ఇవ్వడం పెద్ద కష్టమేమీ కాదు. ఉద్యోగులు అందరూ పిల్లాపాపాలతో హాయిగా బ్రతకాలనే నేను కోరుకొంటున్నాను. అందుకు నేను ఏమి చేయగలనో నా శాయశక్తుల ప్రయత్నిస్తాను. ఇంకా మీతో చాలా మాట్లాడాలని ఉంది కానీ కుదరడం లేదు. మళ్ళీ తరువాత ఎప్పుడైనా తాపీగా కూర్చొని మాట్లాడుకొందాము. జై తెలంగాణా,” అని సిఎం కెసిఆర్‌ తన ప్రసంగం ముగించారు.

ఉద్యోగుల మనసులు గెలుచుకొనేవిధంగా ఆయన మాట్లాడిన మాటలను కొన్ని పదాలతో...వాక్యాలతో వర్ణించడం కష్టమే. ఈ క్రింద ఇచ్చిన ఆయన ప్రసంగం వీడియో క్లిప్పింగ్ చూస్తే ప్రజల హృదయాలను గెలుచుకోగల నేర్పు కేవలం సిఎం కెసిఆర్‌కే సాధ్యం అని మీరు అంగీకరించక మానరు. (వీడియో : ‘ఆంధ్రజ్యోతి-యూట్యూబ్’ సౌజన్యంతో)  



Related Post