ఛలో... బిజిపికి కూడా క్లారిటీ వచ్చేసింది

August 31, 2018


img

నిన్న మొన్నటి వరకు ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం లేదని బిజిపి నేతలు వాదించేరు కానీ ముందస్తు ఎన్నికల గురించి రాష్ట్ర బిజిపి నేతలకు ఇప్పుడు పూర్తి క్లారిటీ వచ్చేసింది. ఆ పార్టీ ఎంపీ బండారు దత్తాత్రేయ ముందస్తు ఎన్నికలు తధ్యమని ప్రకటించారు. ఇటీవల డిల్లీ వెళ్లినప్పుడు బిజిపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను కలిసినప్పుడు, ముందస్తు ఎన్నికలు తధ్యమని కనుక పార్టీ శ్రేణులను అందుకు సిద్దం చేయాలని ఆదేశించారని దత్తన్న చెప్పారు.

అయితే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు వీలుగా తాము రెండు నెలల క్రితం నుంచే పార్టీ అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియను మొదలుపెట్టమని దత్తన్న చెప్పారు. కనుక ముందస్తు ఎన్నికలను ఎదుర్కోవడానికి తమ పార్టీ సిద్దంగా ఉందని చెప్పారు. తాను మళ్ళీ ఎంపీగా లేదా పార్టీ ఆదేశిస్తే ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి సిద్దమని ప్రకటించారు. 

రాష్ట్ర ప్రభుత్వం  రూపొందించిన జోనల్ వ్యవస్థను బిజిపి ఎప్పుడూ వ్యతిరేకించలేదని, ఆ సాకుతో ఉద్యోగాల భర్తీ చేయకపోవడాన్నే తాము నిరసించామని దత్తన్న చెప్పారు. తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి తమ పార్టీ ఎప్పుడూ కట్టుబడి ఉందని అందుకే సిఎం కేసీఆర్‌కు ప్రధాని నరేంద్ర మోడీతో సహా కేంద్రమంత్రులు అధికారులు అంతగా సహకరిస్తున్నారని దత్తన్న అన్నారు. 

ముందస్తు ఎన్నికల గంట కొట్టిన టీఆర్ఎస్‌ ఇంతవరకు వాటిపై నిర్ధిష్టమైన ప్రకటన చేయలేదు. కానీ వాటి గురించి ఇంతవరకు అయోమయంలో ఉన్న బిజిపియే టీఆర్ఎస్‌ కంటే ముందుగా ముందస్తు ఎన్నికలు జరుగబోతున్నాయని నిర్ధిష్టమైన ప్రకటన చేయడం విశేషం. బిజిపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా స్వయంగా ఈ విషయాన్ని దృవీకరించారని దత్తన్న చెప్పారు కనుక ముందస్తు ఎన్నికలపై కొనసాగుతున్న సస్పెన్స్ ఇక ముగిసినట్లే. ఈ విషయంలో రాష్ట్ర బిజిపి నేతలకు పూర్తి క్లారిటీ వచ్చేసింది కనుక ఇక వారు కూడా ముందస్తు సన్నాహాలు చేసుకోవచ్చు. ముందస్తు ఎన్నికలు ఖాయమని తెలిసిపోయింది కనుక ఇక అసెంబ్లీని ఎప్పుడు రద్దు చేస్తారు? ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడు ప్రకటిస్తారు? ఏ పార్టీ దేనితో పొత్తులు పెట్టుకోబోతోంది? ఎవరు ఏ పార్టీలోకి ఫిరాయించబోతున్నారు? అనే విషయాలపై స్పష్టత రావలసి ఉంది. అంతే! 


Related Post