కేసీఆర్ ఒకటనుకొంటే...

August 31, 2018


img

కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి శుక్రవారం ఉదయం విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చినప్పుడు ఏపీ సిఎం చంద్రబాబు నాయుడుతో స్థానిక గేట్-వే హోటల్‌లో సుమారు 40 నిమిషాలపాటు సమావేశమయ్యారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ, “ఇది కేవలం మర్యాదపూర్వకమైన సమావేశం మాత్రమే. ఎన్డీయే కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వాన్ని గద్దె దించడానికి మాతో కలిసి వచ్చే పార్టీలను కలుపుకొని ముందుకు సాగాలని భావిస్తున్నాము. ప్రాంతీయ పార్టీలన్నీ...ముఖ్యంగా దక్షిణాది పార్టీలన్నీ కలిసి పనిచేయాల్సి ఉంది. ఈ అంశంపై మేము ప్రాధమికంగా చర్చించాము. మళ్ళీ త్వరలో మరొకసారి సమావేశమయ్యి దీనిపై మరింత లోతుగా చర్చించాలని నిర్ణయించాము,” అని అన్నారు. 

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు సిఎం కేసీఆర్‌ బెంగళూరు వెళ్ళి దేవగౌడ, కుమారస్వామితో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు గురించి చర్చించి, తిరిగి వస్తూ వారి జెడిఎస్ పార్టీకి మద్దతు ప్రకటించారు. ఆ తరువాత కధ అందరికీ తెలిసిందే.  

కర్ణాటక ఎన్నికల తరువాత ఫెడరల్ ఫ్రంట్ ఆవిర్భవిస్తుందనుకొంటే, అనూహ్యంగా కాంగ్రెస్‌ పార్టీతో చంద్రబాబుకు దోస్తీ కుదిరింది. ఇప్పుడు ఆయనే ప్రాంతీయ పార్టీలను కూడగట్టడానికి సిద్దపడుతున్నారు. ఇక కేసీఆర్‌ మద్దతు ఇచ్చిన జెడిఎస్ కాంగ్రెస్‌ పార్టీకి, టిడిపికి దగ్గరైంది. అలాగే ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం సిఎం కేసీఆర్‌ చెన్నై వెళ్ళి స్టాలిన్ ను కలిసివస్తే ఆయన కూడా టిడిపికి దగ్గరవుతున్నారు. అలాగే కేసీఆర్‌ మొట్టమొదట కలిసిన తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీతో అంటకాగుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీతో కలిసి పనిచేసే పార్టీలను ఆమె స్వయంగా కూడగట్టే బాధ్యత ఆమె తన భుజం మీద వేసుకొన్నారు. 

ఇక ఫెడరల్ ఫ్రంట్ గురించి చర్చించేందుకు స్వయంగా హైదరాబాద్‌ వచ్చి సిఎం కేసీఆర్‌ తో సమావేశమైన యూపీ మాజీ సిఎం అఖిలేశ్ యాదవ్ కూడా కాంగ్రెస్‌ పార్టీతో కలిసి పనిచేయడానికి సిద్దపడుతున్నారు. కనుక వీరందరూ కాంగ్రెస్‌ పార్టీతో కలిసి మోడీ సర్కారుతో యుద్దానికి సిద్దమవుతున్నప్పుడు, సిఎం కేసీఆర్‌ ఏమి చేస్తారో చూడాలి. 


Related Post