పొత్తులకే టి-కాంగ్రెస్‌ మొగ్గు...కానీ దేనితో?

August 31, 2018


img

రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం కనిపిస్తునందున టి-పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గురువారం డిల్లీ వెళ్ళి కాంగ్రెస్‌ అధిష్టానంతో సమావేశమయ్యి తాజా పరిస్థితుల గురించి చర్చించారు. భావస్వారూప్యత కలిగిన పార్టీలతో పొత్తులు పెట్టుకోవాలని వారు నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే ముందస్తు ఎన్నికల గురించి సిఎం కేసీఆర్‌ నిర్ధిష్టమైన ప్రకటన చేసిన తరువాతే పొత్తులపై తుది నిర్ణయం తీసుకోవాలని వారు నిర్ణయించుకొన్నారు. 

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ మొదటి నుంచి పొత్తులకు ఆసక్తి చూపుతూనే ఉంది కానీ దానితో పొత్తులకు టిడిపి తప్ప ఏ పార్టీ కూడా ఆసక్తి చూపడం లేదు. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్ ప్రజాసమస్యల పరిష్కారం కోసం అనేకసార్లు కాంగ్రెస్‌ నేతలతో కలిసి పోరాటాలు చేశారు. కనుక నేటికీ వారి మద్య బలమైన సంబందాలే ఉన్నాయి. కానీ ఆయన కూడా కాంగ్రెస్‌ పార్టీతో పొత్తులు పెట్టుకోవడానికి విముఖత చూపిస్తున్నారు. అలాగే రాష్ట్రంలో చిన్న చిన్న పార్టీలన్నీ సిపిఎం నేతృత్వంలో ఏర్పాటైన బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బి.ఎల్.ఎఫ్.  కూటమి)లో భాగస్వాములుగా ఉన్నాయి. ఇక కాంగ్రెస్‌తో పొత్తులకు టిడిపి ఆసక్తి చూపుతున్నప్పటికీ కాంగ్రెస్‌ పార్టీలోనే కొంతమంది సీనియర్ నేతలు విముఖత చూపిస్తున్నారు. కనుక టిడిపితో కాంగ్రెస్‌ పొత్తులు అనుమానమే. ఇక మిగిలినవి వైకపా, సిపిఐ పార్టీలు మాత్రమే. వాటిలో సిపిఐతో పొత్తులకు అవకాశం ఉంది. 

టీఆర్ఎస్‌కు ఏకైక ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్న కాంగ్రెస్‌ పార్టీ పొత్తుల కోసం ఆరాటపడుతుంటే, చాలా బలహీనంగా ఉన్న బిజిపి ఒంటరిగా పోటీ చేయడానికి సిద్దపడుతుండటం విశేషం. కానీ పొత్తులు పెట్టుకోవడానికి బలమైన పార్టీలే కనిపించడం లేదు. మరి కాంగ్రెస్‌ ఏ పార్టీతో పొత్తులు పెట్టుకొంటుందో చూడాలి.


Related Post