నివేదన సభపై హైకోర్టులో పిటిషను

August 30, 2018


img

రాష్ట్రంలో ప్రతిపక్షాలు జరుపుకొనే బహిరంగసభలకు పోలీసులు అనుమతివ్వకపోతే హైకోర్టును ఆశ్రయించి అనుమతి తెచ్చుకోవడం చూశాము. అదే అధికారంలో ఉన్న టీఆర్ఎస్‌ బహిరంగసభ జరుపుకోదలిస్తే ఎవరైనా అడ్డుకోగలరా? అంటే అడ్డుకోలేరనే చెప్పవచ్చు. సెప్టెంబరు 2న కొంగర కలాన్ వాడ టీఆర్ఎస్‌ జరుపుకోబోయే  ప్రగతి నివేదన సభకు అనుమతి ఇవ్వరాదని కోరుతూ ప్రముఖ న్యాయవాది, పర్యావరణ పరిరక్షణ సమితి అధ్యక్షుడు పి. శ్రీధర్ గురువారం హైకోర్టులో ఒక ప్రజాహిత పిటిషను వేశారు.

రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించదలిస్తే, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా ఇంకా ఇతర ప్రసార మాద్యమాల ద్వారా వివరించవచ్చని, వేలాది వాహనాలలో లక్షలాది ప్రజలను ప్రగతి నివేదన సభకు తరలించడం వలన ఊహించని సమస్యలు తలెత్తవచ్చని కనుక ప్రగతి నివేదన సభకు అనుమతించరాదని హైకోర్టుకు విజ్నప్తి చేశారు. ఆ పిటిషనును విచారణకు స్వీకరించిన హైకోర్టు బహుశః శుక్రవారం దానిపై విచారణ జరిపే అవకాశం ఉంది. అయితే ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు బహిరంగసభలు జరుపుకొనే హక్కు కలిగి ఉంటాయి కనుక బహుశః న్యాయస్థానం ఆ సభను అడ్డుకోకపోవచ్చు కానీ ఆంక్షలు విధించే అవకాశం ఉంది.


Related Post