టీఆర్ఎస్‌ను ఎదుర్కోవడానికి కాంగ్రెస్‌ సిద్దమేనా?

August 30, 2018


img

రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల ఊహాగానాలు జోరుగా వినిపిస్తుండటంతో కాంగ్రెస్‌ నేతలు సిఎం కేసీఆర్‌, టీఆర్ఎస్‌ నేతలపై విమర్శల జోరు పెంచారు. వారి తీరు చూస్తుంటే సిఎం కేసీఆర్‌ను, టీఆర్ఎస్‌ ప్రభుత్వాన్ని విమర్శిస్తే చాలు...ప్రజలు కాంగ్రెస్‌ పార్టీకి ఓట్లేసి గెలిపిస్తారని భావిస్తున్నట్లుంది తప్ప తమకంటే చాలా బలంగా ఉన్న టీఆర్ఎస్‌ను ఎదుర్కోవడానికి వారి వద్ద బలమైన వ్యూహం ఏమీ ఉన్నట్లు కనబడటం లేదు. 

నిరుద్యోగ భృతి, ఒకేసారి రూ.2 లక్షలు పంట రుణాల మాఫీ, ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్లను రెట్టింపు చేయడం అనే మూడు హామీలను ఉత్తమ్ కుమార్ రెడ్డి చెపుతున్నారు కానీ రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు ఎవరూ ఆయనకు వంతపాడటంలేదు. అలాగే ఇటీవల హైదరాబాద్‌లో రెండు రోజులు పర్యటించిన కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా ఆ హామీల గురించి ప్రస్తావించలేదు. అదే సమయంలో అవి ఆచరణ సాధ్యం కానీ హామీలని సిఎం కేసీఆర్‌తో సహా టీఆర్ఎస్‌ నేతలు బలంగా వాదిస్తున్నా కాంగ్రెస్‌ నేతలు ఎవరూ తమ హామీలను గట్టిగా సమర్ధించుకొనే ప్రయత్నం చేయడం లేదు. కనుక టీఆర్ఎస్‌ను ఎదుర్కోవడానికి కాంగ్రెస్‌ పార్టీ సిద్దం చేసుకొన్న ఆ మూడు బలమైన ఆయుధాలు కూడా నిరుపయోగంగా మారాయి. 

ఆ హామీలను పక్కన పెడితే టీఆర్ఎస్‌ను ఎదుర్కోవడానికి కాంగ్రెస్‌ నేతల వద్ద వేరే ఆయుధమేదీ ఉన్నట్లు కనిపించదు. రాహుల్ గాంధీ పిలుపు అందుకొని హడావుడిగా డిల్లీ వెళ్ళిన ఉత్తమ్ కుమార్ రెడ్డి టీఆర్ఎస్‌ను ఎదుర్కోవడానికి డిల్లీ నుంచి కొత్త ఆయుధాలు ఏమైనా తీసుకువస్తారేమో చూడాలి. 

కానీ ఎన్నికలు దగ్గర పడుతున్న ఈ తరుణంలో రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ చాలా బలహీనంగా కనిపిస్తోంది. షరా మామూలుగా నేతల మద్య విభేధాలు, సమన్వయలోపం, సమిష్టి కార్యాచరణ లోపించడం వంటి అనేక లోపాలు కనిపిస్తున్నాయి. వ్యక్తిగత అజెండాలతో ఎవరికి వారు టీఆర్ఎస్‌ను తిట్టిపోయడమే తప్ప అందరూ కలిసి టీఆర్ఎస్‌ను ఏవిధంగా ఎదుర్కోవాలనే ఆలోచనే చేస్తున్నట్లు లేదు. కాంగ్రెస్‌ పార్టీ ఈ లోపాలను అధిగమించి సమిష్టిగా పనిచేయలేకపోతే 75 సీట్లు సాధించడం పగటికలగానే మిగిలిపోవచ్చు.


Related Post