ముందస్తు సమావేశం ఎప్పుడో?

August 30, 2018


img

సిఎం కేసీఆర్‌ డిల్లీ పర్యటన విజయవంతంగా ముగించుకొని తిరిగిరాగానే మంత్రివర్గ సమావేశం నిర్వహిస్తారని, మళ్ళీ ప్రగతి నివేదన సభ తరువాత  మరోసారి సమావేశం నిర్వహించి అసెంబ్లీ రద్దుపై నిర్ణయం తీసుకొంటారని వార్తలు వచ్చాయి. కానీ నిన్న నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో చనిపోవడం, నేడు ఆయన అంత్యక్రియల కార్యక్రమం కారణంగా మంత్రివర్గ సమావేశం నిర్వహించలేని పరిస్థితి ఏర్పడింది. మరో మూడు రోజులలో అంటే ఆదివారం ప్రగతి నివేదన సభ జరుగబోతోంది కనుక దాని ఏర్పాట్లను పర్యవేక్షించడంలో సిఎం కేసీఆర్‌, మంత్రులు క్షణం తీరిక లేకుండా ఉన్నారు. కనుక వీలైతే శుక్రవారం లేదా ప్రగతి నివేదన సభ ముగిసిన తరువాత కానీ మంత్రివర్గ సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. 

ఒకవేళ సిఎం కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలనుకొంటే ఆ సమావేశంలోనే చివరిసారిగా శాసనసభ సమావేశాలు నిర్వహించాలా లేదా రద్ధు చేయాలా? అనే దానిపై తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. ఒకవేళ ముందస్తు ఎన్నికలకు వెళ్లదలిస్తే సెప్టెంబర్ 10వ తేదీలోగా శాసనసభను రద్ధు చేసి కేంద్ర ఎన్నికల కమీషన్ కు తెలియజేయవలసి ఉంటుంది. అప్పుడే మిగిలిన నాలుగు రాష్ట్రాలతో కలిపి తెలంగాణ శాసనసభకు కూడా ఎన్నికలు నిర్వహించదానికి వీలుపడుతుంది. శాసనసభను రద్ధు చేసిన తరువాత ఎన్నికల కమీషన్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించగానే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుంది. కనుక అప్పుడు కేసీఆర్‌ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కొత్తగా ఎటువంటి సంక్షేమ పధకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రకటించలేరు. ప్రారంభించలేరు. కనుక ఇప్పుడే ఆ పనులన్నీ పూర్తి చేయవలసి ఉంటుంది. ఆ పనులన్నీ చక్కబెట్టడానికి సిఎం కేసీఆర్‌కు కేవలం 10 రోజులు మాత్రమే సమయం మిగిలి ఉంది. కనుక శుక్ర లేదా సోమవారం తప్పకుండా మంత్రివర్గ సమావేశం నిర్వహించే అవకాశం ఉంది.  


Related Post