పతకాలు సాధించనప్పుడు కోటా ఎందుకు?హైకోర్టు ప్రశ్న

August 30, 2018


img

మెడికల్, డెంటల్ కోర్సులలో ప్రవేశాలకు క్రీడల కోటా కింద కొన్ని సీట్లను కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం జూన్ 21న జారీ చేసిన జీవో నెంబరు: 7ను హైకోర్టు కొట్టివేసింది. ఆ జీవోను సవాలు చేస్తూ నలుగురు విద్యార్ధులు హైకోర్టులో పిటిషన్ వేశారు. జస్టిస్‌ రామసుబ్రమణియన్‌ నేతృత్వంలోని ధర్మాసనం దానిపై విచారణ చేపట్టి జూలై 6న ఆ జీవోపై స్టే విదించింది. దీనిపై తుది తీర్పు వెలువరించేవరకు క్రీడల కోటాలో ఎటువంటి ప్రవేశాలు చేపట్టరాదని మద్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై సోమవారం మళ్ళీ విచారణ చేపట్టిన జస్టిస్ రామసుబ్రమణియన్‌ తుదితీర్పు వెలువరిస్తూ చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 

“జీవో నెంబరు: 7ను కొట్టివేస్తునందున 2015లో జారీ చేసిన జీవో నెంబరు: 8ని పునరుద్దరించమని కోరడం సరికాదు. అసలు ఎన్నడూ కనీవినని క్రీడలను ఈ కోటాలో చేర్చడం, వాటి ద్వారా మెడికల్ సీట్లను కేటాయించుకోవడం వలన మెడికల్ సీట్లను అమ్ముకొనే కాలేజీలకు లాభం కలుగుతోంది కానీ క్రీడాకారులకు ఏవిధంగా మేలు కలుగుతోంది? ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించాలనుకోవడం మంచిదే. కానీ ఈ క్రీడల కోటాలో సీట్లు పొందుతున్న వారిలో ఎంతమంది నిజంగా ఆ క్రీడలలో పాల్గొంటున్నారు? ఎన్ని పతకాలు సాధించారు?అంటే సమాధానం లభించదు. కనుక ఈ క్రీడల కోటా అనేది మెడికల్ సీట్లు అమ్ముకొనే కాలేజీ యాజమాన్యాలకు మాత్రమే ఉపయోగపడుతోంది తప్ప క్రీడాకారులకు కాదని మేము భావిస్తున్నాము. కనుక ఈ జీవోను రద్దు చేస్తున్నాము. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగా క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యం ఉన్నట్లయితే అందుకు అనుగుణంగా నియమనిబందనలు, మార్గదర్శకాలతో మళ్ళీ కొత్త జీవోను జారీ చేసినట్లయితే, దానిని పరిశీలించి సహేతుకంగా ఉన్నట్లు మేము భావిస్తే వచ్చే విద్యాసంవత్సరంలో అమలు చేయవచ్చు,” అని అన్నారు.  


Related Post