ఎన్నికల కోసం కాకపోతే నివేదన ఎందుకో?

August 29, 2018


img

సెప్టెంబరు 2వ తేదీన కొంగర కలాన్ వద్ద టిఆర్ఎస్‌ జరుపదలచిన ప్రగతి నివేదన సభ రాబోయే ఎన్నికలను ఉద్దేశ్యించి నిర్వహిస్తున్నది కాదని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ 51 నెలలలో తమ ప్రభుత్వం చేపట్టిన ఇక ముందు చేయబోతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడానికే ఈ బహిరంగసభను నిర్వహిస్తున్నామని కేటీఆర్ చెప్పారు. ఈ ప్రగతి నివేదన సభ ఏప్రిల్ 27న జరిగిన టిఆర్ఎస్‌ ప్లీనరీ సభకు కొనసాగింపు మాత్రమేనని అన్నారు. ప్లీనరీ సభలోనే ఇటువంటి భారీ బహిరంగసభ తరువాత ఎప్పుడో నిర్వహిస్తామని సిఎం కెసిఆర్‌ చెప్పిన సంగతిని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. ముందస్తు ఎన్నికల గురించి సిఎం కెసిఆర్‌ నోటితో స్వయంగా ప్రకటించే వరకు వాటి గురించి మీడియాలో వచ్చే ఊహాగానాలను నమ్మవద్దని ప్రజలను కోరారు. 

సిఎం కెసిఆర్‌ ఈ సభ గురించి ప్రకటించగానే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ప్రభుత్వ పధకాల వలన లబ్ది పొందిన ప్రజలు, అభివృద్ధి ఫలాలాలను అందుకొంటున్నవారు ఈ సభకు స్వచ్ఛందంగా హాజరు కావాలని అనుకొంటున్నారని అన్నారు. ఆవిధంగా వచ్చే వారి సంఖ్యే కొన్ని లక్షలు ఉంటుందని ఇక టిఆర్ఎస్‌ కార్యకర్తలు, నేతలను కూడా కలుపుకొంటే కనీసం 25 లక్షల మంది వరకు ఉండవచ్చని కేటీఆర్ అన్నారు. అందుకు అనుగుణంగానే భారీగా ఏర్పాట్లు చేస్తున్నామని కానీ తాము చేస్తున్న ఈ ఏర్పాట్లు సరిపోవేమోననే భయపడుతున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు.

గత 51 నెలలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలకు టిఆర్ఎస్‌ ఎందుకు తెలియజేయాలనుకొంటోంది? అని ప్రశ్నించుకొంటే ఎన్నికల కోసమేనని అర్దమవుతుంది. కానీ అందుకోసం కాదని మంత్రి కేటీఆర్ అంటున్నారు. కానీ ప్రగతి నివేదన సభలో సిఎం కెసిఆర్‌తో సహా టిఆర్ఎస్‌ నేతలు ఎన్నికల ప్రస్తావన చేయకుండా ఉంటారా? ఎన్నికలలో టిఆర్ఎస్‌నే గెలిపించాలని ప్రజలను కోరకుండా ఉంటారా? అంటే కాదనే సమాధానం వస్తుంది. కనుక ప్రగతి నివేదన సభ ఎన్నికల శంఖారావం పూరించడానికేనని అర్ధమవుతోంది. అందుకే ప్రతిపక్షాలు కూడా పోటీగా బహిరంగసభలు, రధయాత్రలు నిర్వహించడానికి సిద్దం అవుతున్నాయి. అయితే రాష్ట్రాభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి టిఆర్ఎస్‌ నేతలు చెప్పబోయే విషయాలు అందరికీ తెలిసినవే కనుక ఈ ప్రగతి నివేదన సభలో రాష్ట్ర ప్రజలకు కొత్తగా ఏమి వరాలు ప్రకటించబోతున్నారు? ముందస్తు ఎన్నికల గురించి, ఫెడరల్‌ ఫ్రంట్‌ గురించి సిఎం కెసిఆర్‌ ఏమి చెప్పబోతున్నారనేదే ఆసక్తికరమైన అంశాలు.


Related Post