తెలంగాణాకు తరువాత సిఎం ఎవరంటే...

August 29, 2018


img

రాష్ట్రంలో టిఆర్ఎస్‌ మళ్ళీ అధికారంలోకి వస్తే సిఎం ఎవరు అవుతారో అందరికీ తెలుసు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎవరు సిఎం అవుతారో కాంగ్రెస్‌ నేతలకే తెలియదు. ఎందుకంటే ఆ పార్టీలో కనీసం ఒక డజను మంది సిఎం పదవికి పోటీలో ఉన్నారు. ఈ విషయంలో ఎవరి వాదనలు వారికున్నాయి. కానీ ఎవరూ సిఎం పదవి తనకే దక్కలని ధైర్యంగా చెప్పుకోరు. ఎందుకంటే, ఆ పదవికి పోటీ పడుతున్నవారు ఎక్కడ అడ్డుపడతారో అనే భయం. నిన్న గాంధీ భవన్ లో కాంగ్రెస్‌ నేతల అత్యవసర సమావేశం తరువాత ముఖ్యమంత్రి అభ్యర్ధి గురించి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. “ఎన్నికల ప్రక్రియ పూర్తయి కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తరువాతే మా సిఎం అభ్యర్ది పేరు ఖరారు అవుతుంది. మా పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీయే ముఖ్యమంత్రి పేరును సూచిస్తారు. ఈ విషయంలో ఆయనదే తుది నిర్ణయం. పార్టీలో అందరూ దానికి బద్దులై ఉంటారు,” అని చెప్పారు. 

గత ఎన్నికల సమయంలో అందరూ పార్టీని గెలిపించుకొనేందుకు గట్టిగా ప్రయత్నించకుండా టికెట్ల కోసం, పిసిసి అధ్యక్ష పదవి కోసం కుమ్ములాడుకోవడంతో అవలీలగా విజయం సాధించవలసిన కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. ఒకవేళ రాహుల్ గాంధీయే స్వయంగా ఇప్పుడు కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి అభ్యర్ది పేరు ప్రకటించినా పార్టీలో కుమ్ములాటలు మొదలైపోతాయి. అవి కాంగ్రెస్ పార్టీ ఓటమికి దారి తీయడం ఖాయం. కనుక కాంగ్రెస్‌ నేతలందరినీ కలిపి ఉంచడం కోసం ఎన్నికలు   పూర్తయ్యేవరకు ఈ విషయం ప్రస్తావించకపోవడమే మంచిది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఎలాగూ అప్పుడు కుమ్ములాటలు తప్పవు కానీ ఓడిపోతే ఆ అవసరమే ఉండదు కదా! 


Related Post