మరీ ఇంత అయోమయమా?

August 29, 2018


img

సిఎం కెసిఆర్‌-ప్రధాని మోడీ మద్య కొనసాగుతున్న బలమైన అనుబంధం కారణంగా టిఆర్ఎస్‌తో ఎటువంటి వైఖరి అవలంభించాలనే దానిపై రాష్ట్ర బిజెపి నేతలలో అయోమయం నెలకొని ఉండటం సహజం. కానీ ముందస్తు ఎన్నికలపై కూడా వారు అయోమయస్థితిలోనే ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. అందుకు ఉదాహరణగా ఆ పార్టీలో నిన్న జరిగిన రెండు భిన్న పరిణామాలను చెప్పుకోవచ్చు. 

సిఎం కెసిఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్ళడం ఖాయంగా కనిపిస్తోంది కనుక రాష్ట్ర బిజెపి నేతలు మంగళవారం రాత్రి అత్యవసరంగా సమావేశమయ్యి ఎన్నికల ఏర్పాట్ల గురించి చర్చించారు. ఆ సమావేశంలో బండారు దత్రాత్రేయ, జాతీయ నేత మురళీధర్‌రావు, పార్టీ ప్రధాన కార్యదర్శి చింతా సాంబమూర్తి, కిషన్‌రెడ్డి, ప్రభాకర్, రామ్‌చందర్‌రావు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికలలో ఏ పార్టీతో పొత్తులు పెట్టుకోకుండా ఒంటరిగా పోటీ చేయాలని, అన్ని అసెంబ్లీ, ఎంపీ స్థానాలకు పోటీ చేయాలని నిర్ణయించారు. టిఆర్ఎస్‌ ప్రగతి నివేదన సభలో సిఎం కెసిఆర్‌ చేసే ప్రకటనను బట్టి రెండవ విడత జన చైతన్య యాత్ర సెప్టెంబరు 10 లేదా అంతకంటే ముందుగా ప్రారంభించి ప్రజాలలోకి వెళ్లాలని నిర్ణయించారు. పార్టీ అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియను కూడా వీలైనంత త్వరగా పూర్తిచేసి వారి పేర్లను ప్రకటించాలని సమావేశంలో నిర్ణయించారు. అంటే రాష్ట్ర బిజెపి నేతలు ముందస్తు ఎన్నికలు జరుగుతాయని వాటిని ఎదుర్కోవడానికి సిద్దం అవుతున్నారని స్పష్టం అవుతోంది. 

ఇక రాష్ట్ర బిజెపి అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు చెప్పిన మాటలు ఇందుకు పూర్తి భిన్నంగా ఉండటం విశేషం. ఆయన నిన్న మీడియాతో మాట్లాడుతూ, “సిఎం కెసిఆర్‌ తీరు చూస్తే ముందస్తు ఎన్నికలకు వెళ్ళే సూచనలు కనిపిస్తున్నాయి. కానీ ఎట్టి పరిస్థితులలో అది సాధ్యం కాదని మేము భావిస్తున్నాము. కెసిఆర్‌ ఇప్పటికిప్పుడు హడావుడిగా అసెంబ్లీని రద్దు చేసినా నాలుగు రాష్ట్రాలతో కలిపి ఎన్నికలు నిర్వహించడం సాంకేతికంగా సాధ్యం కాదని మేము భావిస్తున్నాము. ఎందుకంటే, ఎన్నికల కమీషన్ తెలంగాణా రాష్ట్రంలో కూడా ఎన్నికలు నిర్వహించే  పరిస్థితిలో లేదు. సిఎం కెసిఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్ళడం ద్వారా సులువుగా ప్రతిపక్షాలను ఓడించి మళ్ళీ అధికారంలోకి రావచ్చని కలలు కంటునట్లున్నారు కానీ అది సాధ్యం కాదు. తెలంగాణా రాష్ట్రంలో కూడా మోడీ సుపరిపాలన ప్రభావం చాలా బలంగా ఉంది. ఆ భయంతోనే సిఎం కెసిఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనుకొంటున్నారు. అయితే దేశవ్యాప్తంగా ఒకేసారి అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు, లోక్‌సభ ఎన్నికలు నిర్వహించదానికి మా పార్టీ కట్టుబడి ఉంది. జమిలి ఎన్నికలు జరిపేందుకు వీలుగా రాబోయే పార్లమెంటు సమావేశాలలో ఒక బిల్లు పెట్టాలని కేంద్రప్రభుత్వం ఆలోచిస్తోంది,” అని చెప్పారు. అంటే ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం లేదని చెపుతున్నట్లు స్పష్టం అవుతోంది. కేంద్రంలో తమ పార్టీయే అధికారంలో ఉన్నప్పటికీ ముందస్తు ఎన్నికల గురించి రాష్ట్ర బిజెపి నేతలకు ఎటువంటి సమాచారం లభించకపోవడం వలననే వారు ఇంత అయోమయంలో ఉన్నారా? అనే సందేహం కలుగుతోంది.


Related Post