అక్కడ ఓకే కానీ ఇక్కడ కాదా?

August 28, 2018


img

కేంద్ర ఎన్నికల కమీషన్ నిన్న డిల్లీలో  దేశంలో అన్ని ప్రధానపార్టీల ప్రతినిధులతో ఒక సమావేశం నిర్వహించింది. చట్టసభలలో మహిళలకు 33 శాతం సీట్లు రిజర్వేషన్లు, ఎన్నికల ప్రచారం, ఖర్చులను నియంత్రించడం మొదలైన అంశాలపై సమావేశంలో చర్చించారు. టిఆర్ఎస్‌ తరపున ఎంపీ వినోద్ కుమార్ ఆ సమావేశంలో పాల్గొన్నారు. చట్టసభలలో మహిళలకు 33 శాతం సీట్లు కేటాయించడాన్ని తమ పార్టీ స్వాగతిస్తుందని తెలిపారు. 

నిజానికి, రాజకీయ పార్టీలకు మహిళల పట్ల సమభావం ఉన్నట్లయితే చట్ట సభలలో మహిళలకు 33 శాతం సీట్లు కేటాయించాలని ఎన్నికల కమీషన్ ప్రతిపాదించకపోయినా అందుకు తగ్గట్లుగా టికెట్లు కేటాయించవచ్చు. ఎన్నికల రానంతవరకు మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలని గట్టిగా వాదించే మన పార్టీలు, ఎన్నికలు వచ్చే సరికి ఆ విషయం మరిచిపోయినట్లు ఆర్ధిక, సామాజిక, రాజకీయ బలాబలాల లెక్కలు చూసుకొని ‘అన్ని విధాలా బలమైన అభ్యర్ధులకు లేదా గెలుపు గుర్రాలకు’ మాత్రమే టికెట్స్ కేటాయిస్తుంటాయి. ఒకవేళ మహిళలో అంతా బలమైన అభ్యర్ది ఉన్నట్లు నమ్మకం కలిగితే లేదా ఆ స్థానం మహిళలకు రిజర్వ్ చేయబడి ఉంటేనే వారికి టికెట్లు ఇస్తాయి లేకుంటే లేదు. 

గత ఎన్నికలలో టిఆర్ఎస్‌ మొత్తం 10 మంది మహిళా అభ్యర్ధులకు టికెట్లు కేటాయించగా వారిలో ఆరుగురు (పద్మా దేవేందర్ రెడ్డి, కొండా సురేఖ, బి.శోభ, ఏ రేఖ, లక్ష్మి, సునీత) ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. కానీ వారిలో ఏ ఒక్కరికీ కెసిఆర్‌ మంత్రివర్గంలో స్థానం లభించలేదు. అందుకు ప్రతిపక్షాల నుంచి టిఆర్ఎస్‌ సర్కారు నిత్యం విమర్శలు ఎదుర్కొంటూనే ఉంది. వచ్చే ఎన్నికలలో సిటింగ్ ఎమ్మెల్యేలకే మళ్ళీ టికెట్స్ కేటాయిస్తానని సిఎం కెసిఆర్‌ ప్రకటించారు. అంటే వచ్చే ఎన్నికలలో కూడా టిఆర్ఎస్‌ మహిళలకు కేవలం 6 సీట్లే కేటాయించబోతోందని స్పష్టం అవుతోంది.

ఇక రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో (గీతారెడ్డి, డికె అరుణ) ఇద్దరే మహిళా ఎమ్మెల్యేలున్నారు. గత ఎన్నికలలో కాంగ్రెస్‌ తరపున మరో 3-4 మహిళా అభ్యర్ధులకు టికెట్లు లభించాయి కానీ వారు ఓడిపోయారు. బహుశః రాబోయే ఎన్నికలలో కూడా కాస్త అటూ ఇటూగా మళ్ళీ అన్ని సీట్లే కేటాయించవచ్చు.  

చట్టసభలలో మహిళలకు 33 శాతం సీట్లు కేటాయించాలని వాదిస్తున్న టిఆర్ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు మహిళలకు తామంతట తాము 33 శాతం టికెట్లు కేటాయించవు. ఎందుకంటే అన్నివిధాలా బలమైన పురుష అభ్యర్ది ప్రత్యర్ధిగా ఉన్నప్పుడు అతనిపై మహిళా అభ్యర్ధిని పోటీకి నిలబెట్టడం వలన ఆ సీటును కోల్పోతామనే భయం చేతనే అని చెప్పవచ్చు. కానీ మహిళలకు అవకాశాలు కల్పిస్తే వారు పురుషులకు ఏవిషయంలోనూ తీసిపోరని ఎంపీ కవిత, పద్మా దేవేందర్ రెడ్డి, కొండా సురేఖ, సబితా ఇంద్రారెడ్డి, డికె అరుణ, గీతారెడ్డి తదితరులు నిరూపించి చూపిన సంగతి మన రాజకీయ పార్టీలు విస్మరిస్తున్నాయి.

కనుక మహిళలకు కేటాయించబడిన స్థానాలలో మాత్రం మహిళా అభ్యర్ధులను నిలబెట్టి మహిళలను గౌరవిస్తున్నట్లు గొప్పలు చెప్పుకొంటాయి. అంతే! కానీ ఒకవేళ ఈసారి ఎన్నికలలో మహిళలకు శాసనసభ, పార్లమెంటులో 33 శాతం సీట్లు కేటాయించాలని ఎన్నికల కమీషన్ ప్రయత్నిస్తే ఎన్ని పార్టీలు దానికి సహకరిస్తాయో చూడాలి.


Related Post