కాంగ్రెస్‌ కంచుకోటలు బద్దలవడం ఖాయం: కేటీఆర్

August 28, 2018


img

మంత్రి కేటీఆర్ సోమవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, “ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈసారి రాష్ట్రంలో కాంగ్రెస్‌ కంచుకోటలు బద్దలవడం ఖాయం. మాకు ఎన్నికలు కొత్తకాదు కనుక అవంటే మాకు భయం లేదు. కానీ కాంగ్రెస్‌ నేతలు మాత్రం ముందస్తు ఎన్నికలంటే చాలా భయపడిపోతున్నారు. జానారెడ్డి వంటి సీనియర్ నేతలు కూడా ముందస్తు ఎన్నికలంటే భయంతో వణికిపోతున్నారు. ఎన్నికలలో పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీలో బలమైన అభ్యర్దులే లేరు. అందుకే ఒకేసారి రెండు లక్షల రూపాయలు పంట రుణాలు మాఫీ చేస్తామని, నెలకు రూ.3,000 నిరుద్యోగభృతి చెల్లిస్తామంటూ ఆచరణ సాధ్యంకానీ హామీలు ప్రకటించి ప్రజలను ఆకట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ అవి సాధ్యమైతే కాంగ్రెస్‌ పాలిత కర్ణాటక, పంజాబ్, పుదుచ్చేరిలలో ఎందుకు అమలుచేయడం లేదు? కనుక ఈ ఎన్నికల కోసమే కాంగ్రెస్‌ నేతలు భూటకపు హామీలు ప్రకటించారని అర్ధమవుతోంది. వాటిని నమ్మవద్దని ప్రజలకు విజ్నప్తి చేస్తున్నాను. రాష్ట్రంలో నిశబ్ధ విప్లవం రాబోతోందని పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పదేపదే చెపుతున్నారు. కానీ వచ్చేది నిశబ్ధ విప్లవం కాదు...రాబోయే ఎన్నికలలో టిఆర్ఎస్‌ ఘనవిజయం సాధించి కాంగ్రెస్‌ నేతల చెవులు చిల్లులు పడిపోయేలా సంబురాలు చేసుకోబోతోంది,” అని అన్నారు. 

కాంగ్రెస్‌ కంచుకోటలు అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తదితరులు ప్రాతినిద్యం వహిస్తున్న నల్గొండ జిల్లా, రేవంత్ రెడ్డి ప్రాతినిద్యం వహిస్తున్న కొడంగల్, సీనియర్ కాంగ్రెస్‌ నేతలు డికె అరుణ, గీతా రెడ్డి, జైపాల్ రెడ్డి, వి.హనుమంత రావు, మల్లు రవి, భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, షబ్బీర్ అలీ, జీవన్ రెడ్డి వంటి హేమాహేమీల స్వంత నియోజకవర్గాలని వేరే చెప్పనవసరం లేదు. అంటే ఈసారి ఎన్నికలలో కాంగ్రెస్‌ పునాదులను దెబ్బ తీయబోతున్నామని మంత్రి కేటీఆర్ చెప్పినట్లు భావించవచ్చు. 

ఒకవేళ రాబోయే ఎన్నికలలో టిఆర్ఎస్‌ చేతిలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో సహ పలువురు సీనియర్ కాంగ్రెస్‌ నేతలు రాజకీయ సన్యాసం స్వీకరిస్తామని సవాలు విసిరారు కనుక కాంగ్రెస్‌ నేతలు కూడా ఈసారి టిఆర్ఎస్‌తో హోరాహోరీగా పోరాడటం ఖాయం.                            

 



Related Post