పొత్తు పొడవక మునుపే సెగలు!

August 27, 2018


img

రాబోయే ఎన్నికలలో తన బద్ద శత్రువైన కాంగ్రెస్ పార్టీతో పొత్తులు పెట్టుకోవడానికి చంద్రబాబు నాయుడు సిద్దపడినప్పటికీ, రెండు తెలుగు రాష్ట్రాలలో కాంగ్రెస్‌ నేతలు విముఖత చూపిస్తుండటం విశేషం. రాష్ట్ర విభజన తరువాత ఏపిలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్ పార్టీకి టిడిపి అండదండలు అవసరం కాగా, తెలంగాణాలో ఫిరాయింపుల, ఓటుకు నోటు కేసు కారణంగా బలహీనపడిన టిడిపికి కాంగ్రెస్‌ అండదండలు అవసరం. కానీ ‘టిడిపితో మాకు పొత్తులు అవసరం లేదని’ ఏపి పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి నిర్మొహమాటంగా చెపుతుండటం విశేషం.   

ఇక టిడిపి నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డి, టి-పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్ప కాంగ్రెస్ పార్టీలో మరెవరూ టిడిపితో పొత్తులు పెట్టుకోవడానికి ఆసక్తి చూపడంలేదు. విజయశాంతి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తదితరులు టిడిపితో పొత్తులను వ్యతిరేకిస్తున్నారు. 

టిడిపి చాలా బలమైన పార్టీ అయినప్పటికీ ఆ పార్టీతో ఇతర పార్టీలు పొత్తులు పెట్టుకోవడానికి ఇష్టపడకపోవడానికి కారణం చంద్రబాబు నాయుడుపై అపనమ్మకమేనని చెప్పవచ్చు. చంద్రబాబు నాయుడు ఇతర పార్టీలను, రాజకీయ నాయకులను తన అవసరానికి వాడుకొని, అవసరం తీరాక తీసి పక్కనపడేస్తుంటారనేది బహిరంగ రహస్యం. అందుకు సజీవ సాక్ష్యాలుగా జూనియర్ ఎన్టీఆర్, ఆర్.కృష్ణయ్య మన కళ్ళముందే ఉన్నారు. చంద్రబాబు నాయుడి  ఏపి నేపద్యం కూడా తెలంగాణాలో టిడిపితో పొత్తులకు అవరోధంగా కనిపిస్తోంది. ఒకవేళ ఏపి, తెలంగాణా రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ టిడిపితో పొత్తులు పెట్టుకోవడానికి ఇష్టపడకపోతే రాబోయే ఎన్నికలలో టిడిపికి ఒంటరిపోరాటం తప్పదు. 


Related Post