వాళ్ళిద్దరి తీరులో ఎంత తేడా!

August 27, 2018


img

ఒకప్పుడు స్నేహితులు ఇప్పుడు శత్రువులుగా మారారు. ఒకప్పటి శత్రువులు మిత్రులుగా మారారిప్పుడు. వారే ఏపీ, తెలంగాణా ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కెసిఆర్‌. 

నాలుగేళ్ల క్రితం ఏపీ, తెలంగాణాలు వేరు పడినప్పుడు, ప్రధాని మోడీకి చంద్రబాబు నాయుడు అత్యంత సన్నిహితుడుగా ఉండేవారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రధాని మోడీతో నేరుగా మాట్లాడే అవకాశం ఉండేది. కేంద్రప్రభుత్వం కూడా ఆయన అడిగిందే తడువుగా ఏపీకి వరాలు ప్రకటిస్తుండేది. 

అదే సమయంలో తెలంగాణా సిఎం కెసిఆర్‌ కేంద్రంతో నిత్యం ఏదో కయ్యమాడుతుండేవారు. కేంద్రంపై తీవ్ర విమర్శలు చేస్తూండేవారు. డిల్లీ వెళ్లడానికి కూడా ఇష్టపడేవారు కారు. ఆ కారణంగా చాలా కాలంపాటు కేంద్రం తెలంగాణాను పట్టించుకోలేదు. 

నాలుగేళ్ళు గడిచేసరికి కేంద్రప్రభుత్వం పట్ల చంద్రబాబు నాయుడు, కెసిఆర్‌ వైఖరిలో పూర్తి విరుద్దమైన మార్పు వచ్చింది. ప్రత్యేకహోదా, విభజన హామీల అమలు చేయలేదంటూ బిజెపితో, కేంద్రప్రభుత్వంతో చంద్రబాబు నాయుడు కటీఫ్ చెప్పేశారు. ఆ తరువాత ఆయనతో సహా టిడిపి మంత్రులు, నేతలు బిజెపి, కేంద్రప్రభుత్వం, ప్రధాని మోడీపై నేరుగా తీవ్ర విమర్శలు ఆరోపణలు చేస్తున్నారు. వాటిపై కేంద్రం అదే స్థాయిలో స్పందించనప్పటికీ ఆ పని బిజెపి చేస్తోంది. 

టిడిపి-బిజెపిల మద్య బందం తెగిపోయిన తరువాత ఏపీకి రావలసిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టులు అన్నిటికీ కొర్రీలు పడుతున్నాయి. ఇప్పుడు చంద్రబాబుకి ప్రధాని మోడీ అపాయింట్ మెంట్ లభించని పరిస్థితి. కనుక ఇప్పుడు ఏపీ సమస్యల గురించి ఎవరు ఎవరికి మొరపెట్టుకోవాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. 

ఇదే సమయంలో కెసిఆర్‌-మోడీ మద్య బంధం చాలా బలపడింది. ఇప్పుడు సిఎం కెసిఆర్‌ తరచూ డిల్లీ వెళుతున్నారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రధాని మోడీ అపాయింట్మెంట్ లభిస్తోంది. అదేవిధంగా కెసిఆర్‌ చేసే ప్రతిపాదనలకు మోడీ వెంటనే ఆమోదం తెలుపుతున్నారు. ప్రాజెక్టులు, నిధుల విడుదల విషయంలో కూడా కేంద్రం చాలా ఉదారంగానే వ్యవహరిస్తోందిప్పుడు. 

మొదట్లో సిఎం కెసిఆర్‌ కేంద్రాన్ని గట్టిగా వ్యతిరేకించినప్పటికీ, కేంద్రంతో సత్సంబంధాలు నెరపవలసిన అవసరం ఉందని గ్రహించి తన వైఖరి మార్చుకొని రాష్ట్రానికి మేలు చేకూర్చుతుండగా, చంద్రబాబు నాయుడు మోడీతో నాలుగేళ్ళపాటు ఎంతో సఖ్యతగా ఉన్నప్పటికీ తన లక్ష్యాన్ని సాధించుకోలేకపోవడంతో ఏపీ రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని చెప్పవచ్చు. అంటే కేంద్రప్రభుత్వం పట్ల చంద్రబాబు నాయుడు అనుసరించిన వైఖరి విఫలం అయ్యిందని, చివరికి కెసిఆర్‌ అనుసరించిన వైఖరే సత్ఫలితాలు ఇచ్చిందని అర్ధమవుతోంది. రాజకీయాలను, అభివృద్ధిని ముడిపెట్టుకోవడం వలననే చంద్రబాబు విఫలం కాగా ఆ రెంటినీ వేర్వేరుగా డీల్ చేస్తుండటం వలననే కెసిఆర్‌ విజయం సాధించినట్లు చెప్పవచ్చు.


Related Post