ముందస్తు ఎన్నికలు వస్తే ఎవరికి లాభం?

August 27, 2018


img

ముందస్తు ఎన్నికల గురించి సిఎం కెసిఆర్‌ చాలా ఆలోచనలే చేస్తున్నప్పటికీ అవి ఆయన పరిధిలో ఉన్న వ్యవహారం కాదని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కె లక్ష్మణ్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రతిపక్షపార్టీలు ఆదివారం హైదరాబాద్‌లో ఒక హోటల్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాయి. 

ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ఒక ప్రశ్నకు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ జవాబు చెపుతూ, “ముందస్తు ఎన్నికల నిర్వహణ సిఎం కెసిఆర్‌ చేతిలో పని కాదు. దానికి గవర్నర్, రాష్ట్రపతి, ఎన్నికల కమీషన్ అంగీకరించాలి. ఈ వ్యవహారంలో కేంద్ర, బిజెపి కూడా ఏమీ చేయలేదు. ఒకవేళ అసెంబ్లీ రద్ధు చేస్తే ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనేది ఎన్నికల కమీషన్ నిర్ణయిస్తుంది తప్ప కెసిఆర్‌ కాదు. ఆలోగా కెసిఆర్ ద్వారా ఆపద్ధర్మ ప్రభుత్వం నడిపించాలా లేక రాష్ట్రపతి పాలన విధించాలా అనే విషయంలో మాత్రమే కేంద్రం నిర్ణయం తీసుకోగలదు. ఒకవేళ ముందస్తు ఎన్నికలకు వెళితే టిఆర్ఎస్‌ ఎక్కువ నష్టపోయే ప్రమాదం ఉందని భావిస్తున్నాము. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కోవడానికి మేము సిద్దంగానే ఉన్నాము. కాంగ్రెస్‌, టిఆర్ఎస్‌ల తో సహా అన్ని పార్టీలు కూడా సిద్దంగానే ఉన్నాయని భావిస్తున్నాము,” అని చెప్పారు. 

ముందస్తు ఎన్నికల విషయంలో లక్ష్మణ్ చెప్పింది నిజమే కావచ్చు కానీ ఈ అవరోధాలు, లెక్కలు అన్నీ సరిచూసుకోకుండానే సిఎం కెసిఆర్‌ అసెంబ్లీని రద్దు చేస్తారనుకోలేము. ముందస్తు ఎన్నికలకు వెళ్ళడం వలననే టిఆర్ఎస్‌కు లాభం ఉంటుందని కెసిఆర్‌ గట్టిగా నమ్ముతున్నారు కనుకనే అందుకోసం గట్టి ప్రయత్నాలు మొదలుపెట్టారు. లేకుంటే అటువంటి ఆలోచనే చేసేవారు కాదు.  

టిఆర్ఎస్‌ సిట్టింగ్ ఎమ్మెల్యేలలో 4-5 మందికి తప్ప మిగిలిన అందరికీ మళ్ళీ టికెట్లు ఇస్తామని కెసిఆర్‌ ప్రకటించారు కనుక టిఆర్ఎస్‌లో టికెట్ల పంపిణీ కార్యక్రమం కూడా పూర్తయిపోయినట్లే. అంటే టిఆర్ఎస్‌ ముందస్తు ఎన్నికలకు టిఆర్ఎస్‌ సర్వసన్నద్ధంగా ఉందని స్పష్టం అవుతోంది. కానీ కాంగ్రెస్ పార్టీ టికెట్ల పంపిణీ కార్యక్రమం ఇంకా మొదలుపెట్టనేలేదు. టికెట్ల పంపిణీ అంటే తేనె తుట్టెను కదపడమేననే భయంతోనే కాంగ్రెస్‌ పార్టీ ఇంతవరకు ఆ ప్రయత్నం చేయలేదని చెప్పవచ్చు. ఇతర పార్టీలలో అభ్యర్ధుల ఎంపికలో అనేక సమస్యలున్నాయి. బిజెపి, టిడిపిలతో సహా కొత్తగా పెట్టిన పార్టీలు, కూటములకు అన్ని నియోజకవర్గాలలో టిఆర్ఎస్‌ను డ్డీకొనగల బలమైన అభ్యర్ధులు లేరు. కనుక ఒకవేళ ముందస్తు ఎన్నికలు వస్తే ప్రతిపక్షాలకే ఇబ్బంది. బహుశః అందుకే ఇంతకాలం ఎన్నికల కోసం ఎదురుచూపులు చూసిన ప్రతిపక్షాలు ఇప్పుడు సిఎం కెసిఆర్‌ హటాత్తుగా ముందస్తు ఎన్నికలకు వెళ్ధామని అనగానే కలవరపడుతున్నాయి. కొన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి కూడా. కనుక ముందస్తు ఎన్నికలు వస్తే టిఆర్ఎస్‌కే ఎంతో కొంత ప్రయోజనం ఉంటుందని భావించవచ్చు.


Related Post