జోనల్ వ్యవస్థకు వాటికీ లింక్?

August 27, 2018


img

ముఖ్యమంత్రి కెసిఆర్‌ డిల్లీ వెళ్ళి ప్రధాని మోడీని కలిసి రాష్ట్రంలో ఏర్పాటు చేసుకొన్న కొత్త జోనల్ వ్యవస్థ ఆవశ్యకత గురించి వివరించి ఒప్పించారు. నేడో రేపో దానికి రాష్ట్రపతి ఆమోదముద్ర పడుతుందని ప్రధాని మోడీ స్వయంగా హామీ ఇచ్చారని ఎంపీ వినోద్ కుమార్ చెప్పారు. కొత్త జోనల్ వ్యవస్థ అమలులోకి వస్తే ప్రభుత్వోద్యోగాలలో 95 శాతం స్థానికులకు లభిస్తాయని చెప్పారు. అయితే దీనిపై సీనియర్ కాంగ్రెస్‌ నేత జీవన్ రెడ్డి భిన్నంగా స్పందించారు. 

ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “ఉద్యోగాల భర్తీకోసమే కొత్త జోనల్ వ్యవస్థ అని కెసిఆర్‌ చెపుతున్న మాటలు శుద్ధఅబద్దం. ఉద్యోగాల భర్తీ చేయాలని కోరుతూ ప్రతిపక్షాలు నాలుగేళ్ళుగా పోరాడుతున్నా పట్టించుకొని కెసిఆర్‌ ఇప్పుడు హటాత్తుగా ఉద్యోగాల భర్తీ గురించి మాట్లాడుతుండటం విడ్డూరంగా ఉంది. ఆయన ఆరాటం జోనల్ వ్యవస్థ గురించి కాదు... ఉద్యోగాల భర్తీ గురించీ కాదు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన 31 జిల్లాలకు ఇంతవరకు కేంద్రం ఆమోదం లభించలేదు. వాటికి ఆమోదముద్ర పడకపోతే ఎన్నికలలో టిఆర్ఎస్‌కు ఇబ్బందులు వస్తాయనే ఆలోచనతోనే ‘జోనల్ వ్యవస్థకు ఆమోదముద్ర-ఉద్యోగాల భర్తీ’ అంటూ ఈ కొత్త డ్రామా మొదలుపెట్టారు,” అని జీవన్ రెడ్డి అన్నారు. 

కొత్త జోనల్ వ్యవస్థకు ఆమోదముద్ర పడితే ప్రభుత్వానికి ఉద్యోగాల భర్తీలో వెసులుబాటు లభిస్తుందన్న మాట వాస్తవం. అలాగే కొత్త జిల్లాలతో కూడిన జోనల్ వ్యవస్థకు కేంద్రం ఆమోదముద్ర వేస్తే కొత్త జిల్లాలకు కూడా ఆమోదం లభించినట్లే. కనుక సిఎం కెసిఆర్‌ ఏ ఉద్దేశ్యంతో కొత్త జోనల్ వ్యవస్థకు కేంద్రం చేత ఆమోదముద్ర  వేయించుకోవాలనుకొంటున్నప్పటికీ దాని వలన తెలంగాణా రాష్ట్రానికి లాభమే తప్ప నష్టం జరుగదు.


Related Post