త్వరలో జోనల్ వ్యవస్థకు ఆమోదముద్ర?

August 25, 2018


img

తెలంగాణా రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన జోనల్ వ్యవస్థకు రెండు, మూడు రోజులలోనే రాష్ట్రపతి ఆమోదముద్ర వేసే అవకాశం ఉందని టిఆర్ఎస్‌ ఎంపి వినోద్ కుమార్ తెలిపారు. ఈరోజు సాయంత్రం ప్రధాని మోడీ సిఎం కెసిఆర్‌తో సమావేశమయ్యారు. దాదాపు 20 నిమిషాలపాటు జరిగిన వారి సమావేశం కొద్ది సేపటి క్రితమే ముగిసింది. 

ఆ సమావేశపు వివరాలను టిఆర్ఎస్‌ ఎంపి వినోద్ కుమార్ మీడియాకు తెలియజేస్తూ, “రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన జోనల్ వ్యవస్థపై న్యాయశాఖ, హోంశాఖ కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. అయితే సిఎం కెసిఆర్‌ ఇచ్చిన వివరణతో ప్రధాని మోడీ సంతృప్తి వ్యక్తం చేశారు. దీనికి రెండు మూడు రోజులలోనే రాష్ట్రపతి ఆమోదముద్ర పడుతుందని ప్రధాని మోడీ హామీ ఇచ్చారు. దీనికి ఆమోదముద్ర పడితే 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే లభిస్తాయి. దీంతో 10,000 మంది పంచాయితీ కార్యదర్శులను నియమించుకోవడానికి మార్గం సుగమం అవుతుంది. హైకోర్టు విభజన, వెనుకబడిన జిల్లాలకు నిధులు విడుదల మొదలైన రాష్ట్రానికి సంబందించిన అంశాలపై ప్రధాని మోడీతో చర్చించి రాష్ట్రానికి తోడ్పడవలసిందిగా సిఎం కెసిఆర్‌ కోరారు. నిధుల విడుదల గురించి మాట్లాడేందుకు సిఎం కెసిఆర్‌ ఆదివారం ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీతో సమావేశం కానున్నారు,” అని చెప్పారు.

అయితే ముందస్తు ఎన్నికల గురించి ప్రధాని మోడీ ఏమన్నారో వినోద్ కుమార్ చెప్పలేదు. నేడో రేపో అదీ తెలియవచ్చు. 


Related Post