డిఎస్ పరిస్థితి ఏమిటో?

August 25, 2018


img

టిఆర్ఎస్‌ రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ పార్టీకి నష్టం కలిగేవిధంగా వ్యవహరిస్తున్నారని కనుక ఆయనపై చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ జిల్లా నేతలు సిఎం కెసిఆర్‌కు ఫిర్యాదు చేశారు. వారిలో టిఆర్ఎస్‌ ఎంపి, సిఎం కెసిఆర్‌ కుమార్తె కవిత కూడా ఒకరు. ఆమె ఫిర్యాదు చేశారు కనుక డి.శ్రీనివాఎస్‌ను పార్టీ నుంచి బహిష్కరించడం ఖాయమని అందరూ భావించారు. కానీ సిఎం కెసిఆర్‌ ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో అందరూ ఆశ్చర్యపోయారు. పార్టీ నేతలు తనపై ఫిర్యాదు చేసినప్పటి నుంచి సిఎం కెసిఆర్‌ను కలిసేందుకు డి.శ్రీనివాస్ చాలా ప్రయత్నాలు చేశారు కానీ ఇంతవరకు అపాయింట్మెంట్ లభించలేదు. కనుక పార్టీలో డి.శ్రీనివాస్ పరిస్థితి ఏమిటో ఆయనకే తెలియకుండా ఉంది. 

సరిగ్గా ఇదే సమయంలో ఆయన కుమారుడు సంజయ్ లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం ఆయనను పోలీసులు అరెస్ట్ చేయడంతో డి.శ్రీనివాస్ కుటుంబ ప్రతిష్ట మరింత మసకబారింది. ఇటువంటి సమయంలో శుక్రవారం తెలంగాణా భవన్ లో టిఆర్ఎస్‌ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఆ సమావేశానికి డి.శ్రీనివాస్ డుమ్మా కొడతారని అందరూ అనుకొంటే ఆయన అసలు ఏమీ జరుగనట్లు సమావేశానికి హాజరయ్యి వెళ్ళిపోయారు. తద్వారా సిఎం కెసిఆర్‌ దృష్టిలో పడగలిగారు. కానీ డి.శ్రీనివాస్ గురించి సిఎం కెసిఆర్‌ ఏమనుకొంటున్నారో? ఆయన రాజ్యసభ సభ్యుడు కనుక ఆయనకు టికెట్ అవసరం లేదిపుడు. కానీ కీలకమైన ఎన్నికల సమయంలో ఆయనను పార్టీలో పక్కన పెట్టడంతో పార్టీలో ఆయన పరిస్థితి ఏమిటో ఎవరికీ అర్ధం కావడంలేదు.


Related Post