ముందస్తు ఎన్నికలు దేనికి?

August 25, 2018


img

టిఆర్ఎస్‌ సర్కారుకు వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు అధికారంలో ఉండవచ్చు కానీ నాలుగైదు నెలలు ముందుగానే ఎన్నికలకు వెళ్లాలని సిఎం కెసిఆర్‌ భావిస్తున్నారు. ఐదేళ్లు పదవీకాలం ముగియకమునుపే ముందస్తు ఎన్నికలకు వెళ్ళవలసిన అవసరం ఏమిటి? అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రశ్నించారు. మొన్న శుక్రవారం కామారెడ్డి జిల్లాలో జుక్కల్ మండల కేంద్రంలో బిఎల్ఎఫ్ అధ్వర్యంలో జరిగిన బహిరంగసభలో మాట్లాడుతూ, “సిఎం కెసిఆర్‌ అసలు ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్లాలనుకొంటున్నారో ఇంతవరకు కారణం చెప్పలేదు. ఆయన తన పార్టీ ప్రయోజనాల కోసం ముందస్తు ఎన్నికలకు వెళితే ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది. ఒకవేళ ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనుకొంటే శాసనసభ, లోక్‌సభ ఎన్నికలు కలిపి నిర్వహించాలి. సిఎం కెసిఆర్‌ తన ఇష్టం వచ్చినట్లు పరిపాలన చేస్తున్నారు. సామాజిక న్యాయం అంటే గొర్రెలు, బర్రెలు పంచిపెట్టడం కాదు. దళితులు, బడుగు బలహీనవర్గాలకు అధికారంలో భాగస్వామ్యం కల్పించడం,” అని తమ్మినేని వీరభద్రం అన్నారు. 

నిజానికి టిఆర్ఎస్‌ కంటే ఏడాదిన్నర ముందుగానే సిపిఎం పార్టీ ఎన్నికలకు సన్నాహాలు మొదలుపెట్టింది. రాష్ట్రంలో ప్రతిపక్షాలు బలహీనపడినందున రాజకీయ శూన్యత ఏర్పడిందని కనుక ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశ్యంతో తమ్మినేని వీరభద్రం స్వయంగా 2016, అక్టోబర్ 17వ తేదీ నుంచి 2017 మార్చి 17వరకు ఏకధాటిగా 5నెలలపాటు రాష్ట్రంలో 4,000 కిమీ పాదయాత్ర చేశారు. అనంతరం సిపిఎం నేతృత్వంలో బహుజన వామపక్ష ఫ్రంట్ (బిఎల్ఎఫ్) కూటమిని కూడా ఏర్పాటు చేసుకొని సభలు, సమావేశాలు నిర్వహిస్తూ ఎన్నికలకు సిద్దం అవుతున్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కోవడానికి సిద్దంగా ఉన్నామని, తమ కూటమి అన్ని శాసనసభ, లోక్‌సభ స్థానాలకు పోటీ చేస్తుందని పదేపదే చెప్పుకొంటున్నారు. తమ కూటమిలో 50 శాతం టికెట్లు బీసీలకు కేటాయిస్తామని గొప్పగా చెప్పుకొన్నారు.

ఇదంతా చూస్తున్నవారికి బిఎల్ఎఫ్ ఎన్నికలకు సిద్దంగానే ఉందనే భావించడం సహజం. కానీ సిఎం కెసిఆర్‌ నాలుగైదు నెలల ముందు ఎన్నికలకు వెళ్లాలనుకొంటుంటే సిపిఎం తడబడుతుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. అంటే ముందస్తు ఎన్నికలు వస్తే బిఎల్ఎఫ్ ఎదుర్కొలేదా? అది ఇంకా ఎన్నికలకు సిద్దం కాలేదా? అనే సందేహం కలుగుతోంది. ప్రతిపక్షాలకు ఇష్టమున్నా లేకపోయినా ముందస్తు ఎన్నికలు రాక మానవు. కనుక ఇంతకాలం ప్రగల్భాలు పలుకుతున్న ప్రతిపక్షాలు తమ సత్తా చూపవలసిన సమయం దగ్గర పడిందని చెప్పవచ్చు.


Related Post