సెప్టెంబర్ లోనే శాసనసభ రద్ధు?

August 25, 2018


img

ఈ ఏడాది డిసెంబరు 15వ తేదీలోగా బిజెపి పాలిత రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, రాజస్థాన్ శాసనసభ ఎన్నికల ప్రక్రియ ముగించవలసి ఉంటుంది. సాధారణంగా ఎన్నికల ప్రక్రియ నిర్వహించడానికి సుమారు మూడు నెలల సమయం పడుతుంది. అంటే డిసెంబర్ 15లోగా ఎన్నికల ప్రక్రియ పూర్తికావాలంటే సెప్టెంబర్ నుంచి మొదలుపెట్టవలసి ఉంటుంది. ముఖ్యమంత్రి కెసిఆర్‌ కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలనుకొంటున్నారు కనుక ఆ మూడు రాష్ట్రాలతో పాటే ఎన్నికలకు వెళ్ళాల్సి ఉంటుంది. ఆ లెక్కన వచ్చే నెల 10వ తేదీలోగా రాష్ట్ర శాసనసభను రద్ధు చేసి ఎన్నికల కమీషన్ కు తెలియజేయవలసి ఉంటుంది. అప్పుడే తెలంగాణా రాష్ట్రంలో కూడా ఆ మూడు రాష్ట్రాలతో కలిపి ముందస్తు ఎన్నికలు నిర్వహించడం సాధ్యమవుతుంది. 

ఎన్నికలకు ఇంత తక్కువ సమయం ఉంది కనుకనే సిఎం కెసిఆర్‌ హడావుడిగా ముందస్తు సన్నాహాలు చేస్తున్నట్లు భావించవచ్చు. బహుశః అందుకే నిన్న టిఆర్ఎస్‌ విస్తృతస్థాయి సమావేశం పూర్తికాగానే సిఎం కెసిఆర్‌ తన పార్టీ ముఖ్యనేతలతో కలిసి ప్రధాని మోడీని కలిసేందుకు డిల్లీ బయలుదేరారని భావించవచ్చు. ఇక జాతకాలు, గ్రహఫలాలను బాగా విశ్వసించే సిఎం కెసిఆర్‌ తన జన్మనక్షత్రం ప్రకారం సెప్టెంబరు 6, 7 తేదీలలో ఏదో ఒకరోజు రాష్ట్ర శాసనసభను రద్ధు చేయవచ్చునని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సెప్టెంబర్ 2వ తేదీన టిఆర్ఎస్‌ నిర్వహించబోయే ‘ప్రగతి నివేధన సభ’లో ముందస్తు ఎన్నికలపై పూర్తి స్పష్టత రావచ్చు.


Related Post