కెసిఆర్‌ ఏమైనా తీన్ మార్ ఖానా? కోదండరామ్

August 21, 2018


img

తెలంగాణా జనసమితి అధ్యక్షుడు కోదండరామ్ సోమవారం హైదరాబాద్‌లో పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ సిఎం కెసిఆర్‌ తీవ్ర విమర్శలు చేశారు. ముందస్తు ఎన్నికల గురించి మాట్లాడుతూ, “కెసిఆర్‌ ఏమైనా తీన్ మార్ ఖానా? ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎన్నికలు నిర్వహించడానికి? ఒకవేళ కెసిఆర్‌కు నిజంగా అంతా దమ్ముంటే ఈరోజే ప్రభుత్వం రద్ధు చేసి ఎన్నికల జరిపించవచ్చు కదా? ఎన్నికల నిర్వహణ ఆయన చేతిలో ఉండదని అందరికీ తెలుసు.

ప్రజాసమస్యలపై నుంచి మీడియా దృష్టి మళ్లించడానికి, టిఆర్ఎస్‌లో అంతర్గత సమస్యలను అధిగమించి పార్టీ ఎమ్మెల్యేలందరినీ కట్టడి చేయడానికే ముందస్తు ఎన్నికలని అంటున్నారు. మిగిలిన పార్టీలు కూడా అదే కారణంతో ముందస్తు పాట పడుతున్నాయి. కానీ నాకున్న సమాచారం ప్రకారం ఎట్టి పరిస్థితులలో డిసెంబర్ 2 కంటే ముందు ఎన్నికలు వచ్చే అవకాశమే లేదు. అంతకంటే ముందు ఎన్నికలు నిర్వహించాలంటే కేంద్రం అనుమతించాలి. ఆ తరువాత అయితే కేంద్ర ఎన్నికల కమీషన్ అంగీకరించాల్సి ఉంటుంది. ముందస్తుకు కేంద్రం తనకు సహకరిస్తుందని కెసిఆర్‌ కలలు కంటున్నారు. కానీ కేంద్రం అందుకు ఒప్పుకోదు.

అసలు కెసిఆర్‌ ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్లాలనుకొంటున్నారో బలమైన కారణం ఏదీ చెప్పలేకపోతున్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్ళి రాష్ట్రంలో ప్రతిపక్షాలను దెబ్బ తీయాలని కెసిఆర్‌ భావిస్తున్నట్లున్నారు. కానీ ఇదివరకు చంద్రబాబు నాయుడు కూడా ఇలాగే ముందస్తు ఎన్నికలకు వెళ్ళి బోర్లాపడ్డారు. ముందస్తుకు వెళితే బహుశః కెసిఆర్‌కు కూడా అదే జరుగవచ్చు. ముందస్తు ఎన్నికలు వస్తే మా తెలంగాణా జనసమితికి ఎక్కువ ప్రయోజనం దక్కవచ్చని నేను భావిస్తున్నాను,” అని అన్నారు.   

పొత్తుల గురించి మాట్లాడుతూ, “ఇప్పుడున్న పరిస్థితులలో ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకోవడం అంటే పురితిబిడ్డను చేజెతులా చంపుకోవడమే. కనుక తెలంగాణా జనసమితి ఏ పార్టీతో పొత్తులు పెట్టుకోదు. రాష్ట్రంలో కొత్తగా రాజకీయాలలోకి రావాలనుకొనేవారిని మా పార్టీ ఆహ్వానిస్తోంది. గతంలో లోక్‌సత్తా, పిఆర్.పి. నవ తెలంగాణా పార్టీల నేతలను ప్రజలు ఆధరించినప్పటికీ వారే నిలబడలేక చేతులెత్తేశారు. కనుక ఈ విషయంలో ప్రజలను తప్పు పట్టడానికి లేదు. రాజకీయాలలో స్థిరంగా ఉండాలనుకొన్న నేతలను ప్రజలు ఎప్పుడూ ఆధారిస్తూనే ఉంటారు,” అని కోదండరామ్ అన్నారు.


Related Post