టిఆర్ఎస్‌కు తిరుగులేదా?

August 20, 2018


img

సిఎం కెసిఆర్‌ స్వయంగా ముందస్తు ఎన్నికల గంటలు మ్రోగిస్తున్నారు కనుక టిఆర్ఎస్‌ పరిస్థితి ఏవిధంగా ఉందో ఓసారి చూద్దాం. తెలంగాణా ఏర్పడిన కొత్తలో జరిగిన గత ఎన్నికలలో రాష్ట్రంలో తెలంగాణా సెంటిమెంటు బలంగా ఉంది. నిజం చెప్పాలంటే నేటికీ అది అంతే బలంగా ఉంది. కనుక ఇది టిఆర్ఎస్‌కు బాగా కలిసివచ్చే అంశమే అవుతుంది. 

ఇక గత నాలుగేళ్ళలో రాష్ట్రంలో కళ్ళకు కనబడేవిధంగా జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల కారణంగా రాబోయే ఎన్నికలలో టిఆర్ఎస్‌కు భారీగా ఓట్లు పడటం ఖాయంగానే కనిపిస్తోంది. ప్రభుత్వం అమలుచేస్తున్న పలు పధకాల గురించి టిఆర్ఎస్‌ సర్కారు బాగానే ప్రచారం చేసుకొంటోంది కనుక ఆ ప్రభావం ప్రజలపై బాగానే పడుతోందని భావించవచ్చు. 

గత ఎన్నికలకు ముందు కెసిఆర్‌తో సహా కేటీఆర్, హరీష్ రావు, ఈటల రాజేందర్, నాయిని నర్సింహారెడ్డి, ఎంపీలుగా పోటీ చేసిన కవిత, జితేందర్ రెడ్డి, ఇంకా పలువురు ఎమ్మెల్యేల పనితీరు ఏవిధంగా ఉంటుందో ప్రజలకు అసలు తెలియదు. కానీ తన పోరాటలతో తెలంగాణా రాష్ట్రాన్ని సాధించిన కెసిఆర్ నాయకత్వ లక్షణాలపై పూర్తి నమ్మకంతోనే రాష్ట్ర ప్రజలు ఆయన మొహం చూసే ఓట్లు వేశారు. 

ఈసారి జరుగబోయే ఎన్నికలలో సిఎం కెసిఆర్‌తో సహా టిఆర్ఎస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల పనితీరు ఏవిధంగా ఉంటుందో ప్రజలకు అర్ధమైంది. వారిలో చాలా  మంది పనితీరుపట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కనుక ఇది కూడా టిఆర్ఎస్‌కు సానుకూలమైన అంశమే. అయితే కొంతమంది ఎమ్మెల్యేల పనితీరు పట్ల ప్రజలు అసంతృప్తిగా ఉన్నప్పటికీ  ఈసారి ఎన్నికలలో కూడా ప్రజలు సిఎం కెసిఆర్‌ మొహం చూసే ఓట్లేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 

ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తప్ప మిగిలిన అన్నీ పార్టీలు బలహీనపడటం టిఆర్ఎస్‌కు కలిసివచ్చే అంశమే. అలాగే టిఆర్ఎస్‌కు ఏకైక ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్న కాంగ్రెస్ పార్టీ అవినీతిని, అసమర్ధతను టిఆర్ఎస్‌ ఈ నాలుగేళ్లలో బాగానే హైలైట్ చేయగలిగింది. ఆ కారణంగా కాంగ్రెస్ పార్టీ కొంత నష్టపోవడం ఆ మేరకు టిఆర్ఎస్‌ లబ్ది పొందడం ఖాయం. 

ఇక మజ్లీస్ పార్టీతో దోస్తీ కారణంగా రాష్ట్రంలో ముస్లిం ఓట్లు టిఆర్ఎస్‌కు పడే అవకాశం ఉంది. ప్రధాని మోడీ-సిఎం కెసిఆర్‌ మద్య కొనసాగుతున్న అనుబందం వలన రాష్ట్రంలో బిజెపి అయోమయపరిస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. కేంద్రంలో... దేశంలోని అనేక రాష్ట్రాలలో అధికారంలో ఉన్న బిజెపి ఈ కారణంగా తెలంగాణా రాష్ట్రంలో అయోమయస్థితిలో ఉండటం చాలా విడ్డూరంగానే ఉంది. జాతీయపార్టీ అయిన బిజెపి రాష్ట్రంలో బలహీనంగా ఉండటం టిఆర్ఎస్‌కు కలిసివచ్చే అంశమే. కనుక ఈసారి ఎన్నికలలో టిఆర్ఎస్‌కు అత్యంత అనుకూల రాజకీయ వాతావరణం నెలకొని ఉందని భావించవచ్చు. అయితే టిఆర్ఎస్‌కు అంతా అనుకూలంగానే ఉందనుకోవడం కూడా సరికాదు. ఎందుకో వేరేగా చెప్పుకొందాం.


Related Post